రంజాన్ మాసంలో ఆటో డ్రైవర్లను ఫైనాన్షియర్లు వేధించవద్దని హోంమంత్రికి విజ్ఞప్తి

హైదరాబాద్, మార్చి 23 (విశ్వం న్యూస్) : రంజాన్ మాసంలో ఫైనాన్షియర్లు ఆటో డ్రైవర్లను వాయిదాలు చెల్లించాలని వేధించకుండా చర్యలు తీసుకోవాలని ఆటో డ్రైవర్లు రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘానికి చెందిన డ్రైవర్లు హోం మంత్రి కార్యాలయంలో గురువారం నాడు హోంమంత్రిని కలిశారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్న ఆటో డ్రైవర్లు సంపాదన ఇతర రోజులతో పోలిస్తే తక్కువ ఉంటుందని, వాయిదాలు చెల్లించాలని ఫైనాన్షియర్లు ఒత్తిడి చేయవద్దని, ఆటోలను సీజ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని సంఘం సభ్యులు హోం మంత్రినీ కోరారు. హోం మంత్రిని కలిసిన వారిలో సంఘం నాయకులు మహమ్మద్ మునీర్, అధ్యక్షులు ఎం ఏ సలీం, మీర్జా రఫాతుల్లా బెగ్ తదితరులు ఉన్నారు. హోం మంత్రి వారి సమస్యలు విని సానుకూలంగా స్పందించారు.