
- తెలంగాణలో ప్రజాస్వామ్యానికి 98% లాక్‌డౌన్
హైదరాబాద్, ఫిబ్రవరి 12, 2026 (విశ్వం న్యూస్): తెలంగాణలో సమాచార హక్కు చట్టం (RTI) ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉందని, ఆ వెంటిలేటర్‌కు కూడా ప్రభుత్వం ఆక్సిజన్ కట్ చేసిందని BRS ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. RTI పోర్టల్‌లో 98 శాతం పెండెన్సీ ఉండటం ప్రజాస్వామ్య వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనమని వ్యాఖ్యానించారు. 98 శాతం పెండెన్సీ అనేది కేవలం సంఖ్య కాదని, తెలంగాణలో ప్రజాస్వామ్యం 98 శాతం మూసివేయబడిందని చెప్పే అద్దమని ఆయన అన్నారు. ఇది సాంకేతిక లోపం కాదని, ఉద్దేశపూర్వకంగా పారదర్శకతను హత్య చేసే చర్యగా అభివర్ణించారు.
రాష్ట్రంలో 3,323 శాఖలు ఉండగా, కేవలం 17 శాఖలే RTI పోర్టల్‌ను వినియోగిస్తున్నాయని పేర్కొన్నారు. అంటే మిగిలిన శాఖలన్నీ కలిసి చట్టాన్ని చెత్తబుట్టలో వేసినట్టేనని విమర్శించారు. ఇది పొరపాటున జరిగిన వ్యవహారం కాదని, ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకూడదనే వ్యవస్థీకృత బాధ్యతారాహిత్య నిరాకరణగా దుయ్యబట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి ఎమ్మార్వో కార్యాలయాల వరకూ ఒకే రకమైన అప్రజాస్వామిక పరిపాలనా సంస్కృతి కొనసాగుతోందని ఆరోపించారు. పారదర్శకతను అడ్డుకునే అలవాటు పైస్థాయి నుంచే మొదలైందన్నారు. ఫైళ్లు తిప్పడం, సమాచారం ఇవ్వకుండా తప్పించుకోవడం, ప్రశ్న అడిగితే అధికారులకు కోపం రావడం, సమాచారం అడిగితే పౌరులను శత్రువుల్లా చూడటం ఇప్పుడు పాలనలో సాధారణంగా మారిపోయిందని విమర్శించారు.
రాహుల్ గాంధీ ఆశయాలతో దేశానికి అందిన సమాచార హక్కు చట్టాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బహిరంగంగానే తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. RTIని అడ్డుకోవడం అంటే అవినీతికి కవచం వేయడమేనని, సమాచారానికి సమాధి కట్టడమేనని అన్నారు. 98 శాతం పెండెన్సీ ఈ ప్రభుత్వ జవాబుదారీతనానికి రాసిన మరణ శాసనమని వ్యాఖ్యానించారు. ఫైళ్లు కదలవని, అధికారులు నోరు విప్పరని, ప్రజల హక్కులు కాలరాయబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంకుశత్వానికి పట్టం కడుతున్న రేవంత్ ప్రభుత్వ ధోరణి ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా మారిందని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.