రేవంత్ రెడ్డి అరాచక
పాలన:ఎమ్మెల్సీ దాసోజు

- రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు –BRS నేతల ఆగ్రహం
- కేసీఆర్ పై చేసిన హేయమైన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలి!
హైదరాబాద్, మార్చి 14 (విశ్వం న్యూస్) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. మాజీ సీఎం, (BRS) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)పై ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, BRS ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ ఈ వ్యాఖ్యలను నేరపూరితమైనవిగా పేర్కొంటూ, రేవంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ఈ రోజు ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డా. దాసోజు శ్రవణ్, BRS రాష్ట్ర నాయకులు డా. కురువ విజయ్ కుమార్, కార్పొరేటర్ వెంకటేష్, తోట్ల స్వామి యాదవ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డా. శ్రవణ్ మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి చేసిన ‘మార్చురీ’ వ్యాఖ్యల వెనుక కుట్ర దాగి ఉంది. ఈ వ్యాఖ్యలు కేసీఆర్ ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉంది” అని అన్నారు.
“రేవంత్ రెడ్డి హత్యా కుట్ర చేస్తున్నాడా?”
డా. శ్రవణ్ తన ప్రకటనలో, “ఓ MLAతో కలిసి రేవంత్ రెడ్డి హత్యా కుట్ర చేస్తున్నాడా? ఒక ప్రజా నాయకుడిని చంపేందుకు కుట్ర పన్నుతున్నారా?” అని ప్రస్తావించారు. “హత్యకు గురైనపుడే మృతదేహం మార్చురీకి వెళ్తుంది. అయితే, కేసీఆర్ గారి శరీరం మార్చురీకి ఎలా వెళ్తుంది?” అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతల మౌనం – ప్రశ్నించిన BRS
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు మౌనం పాటిస్తున్నదని BRS నేతలు ప్రశ్నిస్తున్నారు. “రాహుల్ గాంధీ ఎప్పుడూ ‘నఫ్రత్ కే బజార్ మే మోహబ్బత్ కా దుకాన్’ అంటూ మాట్లాడతారు. అయితే, రేవంత్ రెడ్డి మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు” అని శ్రవణ్ ఎద్దేవా చేశారు.
కేసు నమోదు – రేవంత్‌పై చర్యలు డిమాండ్
BRS నేతలు రేవంత్ రెడ్డిపై IPC 506, 505, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, కేసీఆర్ భద్రతను పెంచాలని, ఈ వివాదాస్పద వ్యాఖ్యల వెనుక కుట్రను బయటపెట్టాలని కోరారు.