రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం రేవంత్ డ్రామా: దాసోజు

హైదరాబాద్, మార్చి 5 (విశ్వం న్యూస్): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను దేశ రాజకీయాల్లో అత్యంత కీలక నాయకుడిగా భావిస్తూ, రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా నామినేట్ చేసే అధికారం తనకే ఉన్నట్టు ప్రవర్తించడం రాజకీయ అహంకారానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు.
రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా సిఫార్సు చేసే స్థాయి తనకుందని చూపించేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆయన రాజకీయ అహంకారాన్ని, అక్రమంగా సంపాదించిన ఆస్తులతో వచ్చిన బలుపును బయటపెడుతున్నాయని దాసోజు అన్నారు. దేశ ప్రధానిని కూడా తానే ‘తయారు చేసే’ స్థాయికి తన ధనబలం, అంగబలం, రాజకీయ యంత్రాంగం పెరిగిపోయాయని ప్రజల్లో ఒక భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇది నవ్వాలో, ఏడవాలో అర్థం కాని రాజకీయ హాస్యాస్పదమని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ నాయకత్వం దేశవ్యాప్తంగా జరిగిన ప్రజా పోరాటాల ద్వారా పుట్టుకొచ్చిందని, ముఖ్యంగా భారత్ జోడో యాత్ర వంటి ఉద్యమాల ద్వారా ఆయనకు దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు లభించిందని దాసోజు గుర్తు చేశారు. అలాంటి నాయకుడికి మెడ నిండా కేసులు ఉన్న ఒక ముఖ్యమంత్రి ఇచ్చే సర్టిఫికెట్ అవసరమా అని ప్రశ్నించారు.
చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడుతూ రాజకీయ డ్రామాలు ఆడటం ద్వారా రేవంత్ రెడ్డి తనకే ప్రాధాన్యం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇటువంటి బహిరంగ ప్రకటనలు చేయడం వల్ల రాహుల్ గాంధీ ప్రధాని పదవి కోసం పోరాడటానికి వెనకాడుతున్నట్టు, ఆయనను ఎవరో ఒప్పించాల్సి వస్తోందన్న తప్పుడు భావన ప్రజల్లో కలిగే ప్రమాదం ఉందని అన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా జాతీయ స్థాయి నాయకత్వాన్ని కూడా కించపరుస్తున్నారని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. సీరియస్ రాజకీయాలను కూడా రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ప్రచారం కోసం వాడుకుంటూ రాజకీయాలను హాస్యాస్పదంగా మారుస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఇలాంటి డ్రామాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఎంత చేసినా ప్రజలు వాస్తవాన్ని గ్రహిస్తారని, అహంకార రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో స్థానం ఉండదని దాసోజు స్పష్టం చేశారు.