తిరుమలగిరి మున్సిపాలిటీకి
చైర్మన్‌గా సంకేపల్లి రఘునందన్ రెడ్డి

తిరుమలగిరి, ఫిబ్రవరి 27, 2026 (విశ్వం న్యూస్) : తిరుమలగిరి మున్సిపాలిటీ పదవి బాధ్యతల స్వీకరణోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ సంకేపల్లి రఘునందన్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీమతి వై. గోవిందమ్మ రవీందర్ మరియు నూతన కౌన్సిలర్లకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డా. గాదరి కిశోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, సర్పంచ్ గుంటకండ్ల రామచంద్ర రెడ్డి, యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహ రెడ్డి, గుజ్జ యుగేందర్ రావు, నేవూరి ధర్మేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బయటపడిందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో లంచాలు ఇవ్వలేదని రైస్ మిల్లర్లపై కేసులు పెట్టి అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తూ పరిపాలన చేస్తోందని విమర్శించారు.

రైతులకు రైతుబంధు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తూ దళారులు, దోపిడిదారులకు మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. కేరళ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి డబ్బులు పంపించాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.
పదేళ్లపాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వర్ణయుగంలా సాగిందని అన్నారు. కరోనా సమయంలో కూడా రైతులను ఆదుకున్నారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని, యూరియా, కరెంట్, నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని జగదీష్ రెడ్డి విమర్శించారు.
ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.