
- విద్యార్థినులకు బంగారు భవిష్యత్
- కుట్టు శిక్షణతో విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంపు
- కుట్టు నేర్పించి జీవితానికి బలం ఇస్తున్న పాఠశాల
అర్వపల్లి, మార్చి 28 (విశ్వం న్యూస్) : అర్వపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు కుట్టు శిక్షణ ఆకట్టుకుంటోంది. చదువుతో పాటు భవిష్యత్తులో స్వయం ఉపాధి సాధించాలనే లక్ష్యంతో హెల్ప్ సంస్థ ఉచితంగా అల్లికలు, కుట్టు శిక్షణ అందిస్తోంది. ఆరు నుంచి పదో తరగతి వరకు మొత్తం 118 మంది విద్యార్థినులు ఈ శిక్షణలో పాల్గొంటున్నారు.

కుట్టు మిషన్లు, ఇతర అవసరమైన సామగ్రి కోసం సంస్థ సుమారు రూ. 2 లక్షలు ఖర్చు చేసింది. సంస్థ వ్యవస్థాపకుడు షేక్ చాంద్ పాషా సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు పాఠశాలల్లో ఇలాంటి శిక్షణ సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి పగిడిమర్రి మల్లేశ్ తెలిపారు. వేసవిలో చదువు మానేసిన విద్యార్థినులకు కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

విద్యార్థినులకు డ్రెస్లు, షర్ట్లు కుట్టడం మాత్రమే కాకుండా, కుట్టులో నైపుణ్యాలు, ఆధునిక అల్లికలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. క్రాఫ్ట్ టీచర్ పోరెల్లా మంగమ్మ ఆధ్వర్యంలో ట్రెండ్‌కు అనుగుణంగా తర్ఫీదు ఇస్తుండడంతో విద్యార్థినులు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు.
ఈ శిక్షణ వల్ల భవిష్యత్తులో ఉద్యోగం రాకపోయినా స్వయం ఉపాధి సాధించవచ్చని విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి మాట్లాడుతూ, చదువుతో పాటు కుట్టు శిక్షణ ఇవ్వడం విద్యార్థినుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరమని, వారు ఎంతో ఉత్సాహంగా నేర్చుకుంటున్నారని తెలిపారు. ఉచితంగా కుట్టు మిషన్లు, సామగ్రి అందించిన హెల్ప్ సంస్థకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.









