ఒక్క డీఏతో సరిపెట్టాలా? ఉద్యోగ–ఉపాధ్యాయుల్లో నిరాశ

హైదరాబాద్, జనవరి 13:
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను ప్రభుత్వం విడుదల చేస్తుందన్న ఆశలపై నీళ్లు చల్లుతూ కేవలం ఒక్క డీఏను మాత్రమే ప్రకటించడం తీవ్ర నిరాశకు గురిచేసిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య విమర్శించారు. ఎంప్లాయ్-ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు మాటలకే పరిమితమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పీఆర్సీ మంజూరుపై సీఎం నుంచి ఇప్పటికీ స్పష్టత లేకపోవడం దురదృష్టకరమని, మిగిలిన డీఏలపై ప్రభుత్వం ఊసే ఎత్తకపోవడం ఉద్యోగులు–ఉపాధ్యాయుల్లో అసంతృప్తిని పెంచుతోందని తెలిపారు. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన డీఏ గత నెలలోనే ఇవ్వాల్సి ఉందని, అంతకుముందు గత ఏడాది జూలైలోనే ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు ఒక డీఏ ఇచ్చినా, కేంద్రం కొత్త డీఏ ప్రకటిస్తే పెండింగ్ సంఖ్య మళ్లీ ఐదుకు చేరుతుందని అన్నారు.
ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీ నివేదికను బహిర్గతం చేసి, గత ప్రభుత్వానికంటే మెరుగైన ఫిట్‌మెంట్‌తో రెండో వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల మెడికల్ రీయింబర్స్‌మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్ బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరారు. ఈహెచ్‌ఎస్ విధివిధానాలపై సీఎం మౌనం వీడాలని, ఎన్నికల మేనిఫెస్టో హామీలను అమలు చేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మల్క కొమరయ్య సూచించారు.