సిట్ విచారణ ముగింపు… నంది నగర్ వద్ద అభిమానులకు అభివాదం చేసిన కేసీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 1, 2026 (విశ్వం న్యూస్) : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)పై కొనసాగిన సిట్ విచారణ ముగిసింది. నంది నగర్ నివాసంలో నిర్వహించిన ఈ విచారణ సుమారు 4 గంటల 45 నిమిషాల పాటు కొనసాగింది.

విచారణ అనంతరం నంది నగర్ నివాసం వద్దకు చేరుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులను కేసీఆర్ గారు ఆత్మీయంగా అభివాదం చేశారు. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ పూర్తిగా సహకరించి సమాధానాలు ఇచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారన్న ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో, విచారణ ముగింపు బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఈ పరిణామాలపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతుండగా, తదుపరి చర్యలపై సిట్ అధికారుల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.