
కాగజ్‌నగర్, జనవరి 29, 2026 (విశ్వం న్యూస్): కాగజ్‌నగర్ పట్టణంలో మునిసిపల్ బీఆర్ఎస్ ఎన్నికల పరిశీలకులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న కుట్ర రాజకీయాలకు పరాకాష్టగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారికి సిట్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ చరిత్రలోనే ఒక “బ్లాక్ డే”గా బీఆర్ఎస్ పార్టీ పరిగణిస్తోందని ఆయన స్పష్టం చేశారు. నైతికంగా, రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్ పార్టీ డొంకతిరుగుడు రాజకీయాలకు పాల్పడుతూ, రాష్ట్రంలో ప్రతిపక్ష గొంతులను అణిచివేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. గత 24 నెలల వ్యవధిలో రెండుసార్లు సిట్ నోటీసులు ఇవ్వడం చరిత్రలోనే తొలిసారి జరుగుతున్న దుర్మార్గమైన రాజకీయ చర్యగా ఆయన అభివర్ణించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపులో భాగమేనని, న్యాయవ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ప్రమాదమని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ అసలు స్వరూపం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు. ఈ అన్యాయ రాజకీయాలకు తగిన గుణపాఠం చెప్పే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి నిరంతరం బలంగా ఎదుగుతున్నందున, ఆ ఎదుగుదలను ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ చౌకబారు రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ రాజకీయ డ్రామాకు తెరలేపారని విమర్శించారు.
కాగజ్‌నగర్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ రూపొందించిన తలకు మాసిన నిబంధనల కారణంగానే హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన కోసం చివరి శ్వాస వరకు పోరాడుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్.ఎస్. ప్రవీణ్‌తో పాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.