ఉమ్మడి వరంగల్ జిల్లాలో దూసుకెళ్తున్న సాఫ్ట్ బాల్ క్రీడ

- సాఫ్ట్ బాల్ క్రీడకు పెరుగుతున్న ఆదరణ
- క్రీడాకారుల ఎంపికలో పెరిగిన పోటీ
- పెరుమాండ్ల సాంబమూర్తి (హనుమకొండ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు)
హనుమకొండ, ఏప్రిల్ 25 (విశ్వం న్యూస్): తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాఫ్ట్ బాల్ క్రీడకు ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన జూనియర్ బాలుర, బాలికల జిల్లా స్థాయి జట్ల ఎంపిక కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో సాఫ్ట్ బాల్ క్రీడాకారుల నైపుణ్యాన్ని మెరుగుపరచేందుకు అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తోందన్నారు.
ఇతర క్రీడలతో పోలిస్తే సాఫ్ట్ బాల్ పట్ల యువతలో ఆసక్తి ఎక్కువవుతుండటంతో ఎంపికల్లో పోటీ తీవ్రంగా మారిందని తెలిపారు. జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ తాబేటి రాజేందర్ మాట్లాడుతూ విద్యా, ఉద్యోగ అవకాశాల్లో క్రీడాకారులకు ఉన్న ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని, నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.
మే 2 నుంచి 4 వరకు జగిత్యాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి బాలికల పోటీల్లో జిల్లా నుంచి ఎంపికైన జట్లు పాల్గొననున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు సాంబయ్యకు రెండు నిమిషాల మౌనంతో శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో సంఘానికి చెందిన అధికారులు, కోచ్‌లు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.