సొల్లు సారయ్య ఘనంగా పదవి విరమణ

హుజురాబాద్, జనవరి 31 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ పట్టణంలోని బాలికల పాఠశాలలో పిటిగా (శారీరక విద్యా ఉపాధ్యాయుడు) విధులు నిర్వహించిన సొల్లు సారయ్య శుక్రవారం తన పదవి విరమణ చేసుకున్నారు. ఈ సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్, నాన్-గజిటెడ్ ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
సొల్లు సారయ్య తన ఉద్యోగ జీవితంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా, రాష్ట్ర స్థాయిలో బాలురకు, బాలికలకు కబడ్డీ, కోకో, హాకీ, వాలీబాల్, ఫుట్‌బాల్ వంటి క్రీడలను నేర్పించి ఎంతో మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దారు. ఈ కృషికి గాను ఆయన మంచి గుర్తింపు పొందారు.
పదవి విరమణ సందర్భంగా శాలువా, పుష్పగుచ్చాలు అందజేసి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ, పదవీ విరమణ తర్వాత కూడా ఉద్యోగులు మరియు ఇతర పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వారిని వాకింగ్ చేపించేందుకు సొల్లు సారయ్య ముందుండాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డెన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రాజేందర్, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకుడు ఈశ్వర్ రెడ్డి, హుజురాబాద్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఇతర మిత్రులు పాల్గొన్నారు.