ప్రాథమిక స్థాయిలోనే బలమైన పునాదులు కల్పించాలి : మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, డిసెంబర్ 31, (విశ్వం న్యూస్) : ప్రాథమిక స్థాయిలోనే బలమైన పునాదులు ఉంటే విద్యార్థులు అన్ని రంగాల్లో దూసుకెళ్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల అవగాహన, సంగ్రహణ శక్తిని బట్టి ఉపాధ్యాయుల బోధన ఉండాలని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గోపాల్ పేట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు రేవల్లి, గోపాల్ పేట మండలాల స్థాయి బోధనాభ్యసన సామాగ్రి మేళాను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకులు నిరంతరం అధ్యయనం చేయాలని, విద్యార్థులకు విషయం నేరుగా అర్ధమయ్యేలా చెప్పాలని సూచించారు.ఎప్పటికప్పుడూ టీచింగ్, లర్నింగ్ టెక్నిక్ లను అందిపుచ్చుకోవాలని కోరారు. వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారి మీద ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. విద్యాశాఖలో తొలిమెట్టు కార్యక్రమం అభినందనీయమని,ఇంటర్, డిగ్రీ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు.
ఉన్నత చదువులు చదివిన వారిలో కూడా ప్రాథమిక అంశాల మీద అవగాహన ఉండడం లేదని అన్నారు. ప్రతి పదివేల మందికి సగటున 44 మంది వైద్యులు ఉండాలని,ఈ సగటున అమెరికాలో కూడా వైద్యులు లేరని పేర్కొన్నారు. భవిష్యత్ లో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తెలంగాణ లో కార్యక్రమాలు జరుగబోతున్నాయని వెల్లడించారు.