సురక్షా దినోత్సవ్ ర్యాలీని
విజయవంతం చేయాలి
కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు
కరీంనగర్ బ్యూరో, జూన్ 3 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం నిర్వహించే సురక్షా దినోత్సవ్ ర్యాలీని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉదయం 8:30 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ర్యాలీ ప్రారంభించడానికి ముందు మంత్రి ప్రసంగం అనంతరం సమర్థవంతమైన సేవలను అందించిన పోలీసులకు ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు.
పోలీసు శాఖ చేపడుతున్న ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ కార్యక్రమాలను వివరించాలని సూచించారు. ఈ ర్యాలీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి ప్రారంభమై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ – కమాన్ చౌరస్తా వద్ద యూటర్న్ తీసుకుని గీతా భవన్ చౌరస్తా – ఐబి చౌరస్తా – కోర్టు చౌరస్తా – మంచిర్యాల చౌరస్తా – గాంధీ రోడ్ – రాజీవ్ చౌక్ – తెలంగాణ అమరవీరుల స్తూపంల మీదుగా తిరిగి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకుటుంది. ర్యాలీలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ఉద్యోగులు, పోలీస్ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు ప్రతిభ విజయాలకు సంబంధించి ఈ ర్యాలీ లో వివరించడం జరుగుతుందని తెలిపారు.
పెట్రో కార్, బ్లూ కోర్స్, డయల్ 100, పోలీసు సాంకేతికత, సైబర్ సెక్యూరిటీ, కమ్యూనిటీ కార్యక్రమాలు, షీ టీమ్స్, భరోసా సెంటర్, పాస్పోర్ట్ వెరిఫికేషన్, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, పోలీసు ప్రజల సత్సంబంధాలు, స్నేహపూర్వక పోలీసింగ్, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం, కోర్టు మానిటరింగ్, పోలీసు పని విభాగాలు, పోలీసు కమ్యూనికేషన్ వ్యవస్థ మొదలగు అంశాలపై పౌరులకు వివరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 7:30 గంటలకు బైపాస్ రోడ్డు లోని వీకన్వెన్షన్ హాల్లో బడాఖానా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొనాలని పోలీస్ కమీషనర్ విజ్ఞప్తి చేశారు.