ఒకే రోజు ముగ్గురు
పోలీసులు మృతి

- వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి
- తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కలవరం
హైదరాబాద్, డిసెంబర్ 29 (విశ్వం న్యూస్) : తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల వాజేడు ఎస్సై సురేష్ గన్‌తో కాల్చుకొని సూసైడ్ చేసుకోగా.. మూడ్రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలో ఓ ఎస్సై, లేడీ కానిస్టేబుల్ చెరువులో శవాలై తేలారు. తాజాగా.. ఒకే రోజు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు సూసైడ్ చేసుకోగా.. మరొకరు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.
చెట్టుకు ఉరేసుకుని మృతి
తెలంగాణలోని మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. కొల్చారంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో చెట్టుకు ఉరేసుకుని సాయి అనే కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. సాయి ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం విచారణ ప్రారంభించారు. దీని తర్వాత తెలంగాణలో మరో ఘటన జరిగింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాలకుంట కాలనీలో బాలకృష్ణ అనే AR కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు.
AR కానిస్టేబుల్ సూసైడ్
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాలకుంట కాలనీలో బాలకృష్ణ అనే AR కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య మానస, ఇద్దరు పిల్లలు యశ్వంత్, ఆశిరిత్‌కు పురుగుల మందు ఇచ్చాడు. అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ బాలకృష్ణ మరణించగా.. అతడి భార్య, పిల్లలు ఇద్దరూ హస్పిటల్‌లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అప్పుల బాధతోనే కానిస్టేబుల్ బాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఇలా ఒక్కరోజే ముగ్గురు మరణించిన ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
గుండెపోటుతో మరొకరు
భువనగిరికి చెందిన మరో హెడ్ కానిస్టేబుల్ దోసపాటి బాలరాజు గుండెపోటుతో మరణించాడు. శనివారం సాయంత్రం శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడ్డాడు. వెంటనే తోటి సిబ్బంది హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గ మధ్యంలోనే బాలరాజు మరణించాడు. అతడి మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.