హీరోల మధ్య తేడాలు ఎందుకు?
ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు

హైదరాబాద్, జనవరి 12, 2026 (విశ్వం న్యూస్) : రాష్ట్రంలో సినీ పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి “కంచె చేను మేసినట్టుగా” వ్యవహరిస్తూ జులుం కొనసాగిస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతి నిర్ణయం వెనుక కమిషన్లే ప్రధానంగా మారాయని విమర్శించారు.
1955 సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం సినిమా ప్రదర్శనలు జిల్లా కలెక్టర్ పరిధిలో ఉండాలని గుర్తు చేసిన దాసోజు శ్రవణ్, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఒక్కో సినిమాకు ఒక్కో శాఖ నుంచి వేర్వేరు జీవోలు జారీ చేస్తోందని మండిపడ్డారు. సినిమాటోగ్రఫీ శాఖను పక్కనబెట్టి హోం శాఖ నుంచే టిక్కెట్ ధరల పెంపు జీవోలు రావడం అసంబద్ధమని, ఈ జీవోలు అన్నీ సీఎంఓ ఒత్తిళ్లతోనే వస్తున్నాయని ఆరోపించారు.

టిక్కెట్ ధరల పెంపు విషయంలో తనకు తెలియకుండానే నిర్ణయం తీసుకున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మొదటి ప్రెస్ మీట్‌లో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అదే అంశంపై హరీష్ రావు న్యాయంగా ప్రశ్నించగానే ఆయనపై కాంగ్రెస్ నేతలు మాటల దాడులు చేయడం దుర్మార్గమని అన్నారు. ముందు కమిషన్లు రాలేదని చెప్పిన మంత్రి, ఇప్పుడు తన వాటా రాగానే మాట మార్చారని ఆరోపించారు. రాష్ట్ర పాలన కూరగాయల దుకాణం నడిపినట్టుగా మారిందని విమర్శించారు.
హీరో ప్రభాస్ పెద్దమ్మ మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అంటే రాజా సాబ్ సినిమా పై కక్ష గట్టారు. అనవసరంగా వివాదాలు రేపి, జీవో ఇచ్చినట్టే ఇచ్చి హైకోర్టు స్టే తెప్పించిన తీరు కూడా ప్రభుత్వ దురుద్దేశాన్ని స్పష్టపరుస్తోందని ఆరోపించారు. “ఒక్కో హీరోకి ఒక్కో న్యాయం ఎందుకు?” అని పలికారు.
అసెంబ్లీలో “నేను కుర్చీలో ఉన్నంత కాలం టిక్కెట్ ధరలు పెంచనివ్వను” అని రెండు భాషల్లో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఏ కమిషన్లు వచ్చాయని ధరలు పెంచుతున్నారని దాసోజు శ్రవణ్ నిలదీశారు. సీఎం శాఖ మంత్రిని పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆత్మగౌరవం ఉంటే కోమటి రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సినిమా థియేటర్లలో దోపిడీ జరుగుతుంటే సీఎం, మంత్రి మౌనంగా ఉండటం దారుణమని అన్నారు. పేదలకు సినిమా చూసే హక్కు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడంలేదని విమర్శించారు. సీఎంను ప్రశ్నించకుండా హరీష్ రావుపై బురదజల్లడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. హోం శాఖను అడ్డం పెట్టుకుని సీఎం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.