సహస్రభాహువుల బాహుబలి…..బాపూ తెలంగాణను తెచ్చినట్టి వీరుడితడు

హైదరాబాద్‌, ఏప్రిల్ 27 (విశ్వం న్యూస్) :

వీర గంధము తెచ్చినారము
పూసి పోదము కదులుడి
బాపు కేసిఆర్ నామము
చరిత నిలుచును తమ్ముడా..!
నింగినంటగ మన గులాబీ
జెండనెత్తవే చెల్లెలా..!
జై తెలంగాణా అంటూ
చేరి పాడవె చెల్లెలా..!
జై బాపు కేసీఆర్ అంటూ
పిడికిలెత్తర తమ్ముడా…!
ఇసుక వేస్తే రాలనంతటి
జనసందోహం సాక్షిగా ,

రజతోత్సవ సభ జరిగినచోటే విజయోత్సవ సభ జరుపుకుందాం. రాజీలేని వీరుడిని శాశ్వత విజేతగా నిలబెడదాం. ద్రోహులను పాతాళంలోకి అణగద్రొక్కుదాం. బాపును పరాజితుడిగా చరిత్రలో నిలబెట్టాలన్నముప్పేట ముట్టడిని మట్టు బెట్టి నాలుగు కోట్ల గుండెల్లీ విజయకేతనం ఎగరేసిన కారణ జన్ముడుని కాపాడుకుందాం | అలెగ్జాండర్ విజయయాత్రను నిలువరించిన పురుషోత్తముడిలా మన బాపు కేసిఆర్ పాతుకుపోయిన పాషిస్టు వలస మూకలతో ఒంటరిగా తలపడి తెలంగాణను విముక్తి చేశాడు. తెలంగాణ పదాన్ని నిషేధించినవాడికి తెలంగాణలో స్థానం లేకుండా చేశాడు. శత్రువు చేతికి చిక్కని రాజకీయ ఎత్తుగడలతో పరాయి మూకలను… చిత్తు చేశాడు.

రాజకీయప్రక్రియ – ఉద్యమం – రెంటినీ సమాంతరంగా నడిపించాడు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచాలనుకున్న వలస పాలకులకు అవకాశం ఇవ్వకుండా సత్యాగ్రహం అనే మహాత్ముడి మార్గాన్ని ఎంచుకుని బాపు కేసిఆర్ తెలంగాణ మహాత్ముడయ్యాడు. అందుకే ఆయన తెలంగాణ బాపుగా జనం నోళ్ళలో ఉన్నాడు. రక్తంబొట్టు చిందకుండా తెలంగాణను విముక్తి చేస్తానన్న తన బాసను నిలుపుకున్న బాపు కేసిఆర్ నిజంగా మనతెలంగాణ జాతికి బాపే !

తెలంగాణ గడ్డకు, తెలంగాణ బిడ్డలకు కాంగ్రెస్ చేసిన గాయాలు చెబితే ఒడిసిపోయేదికాదు. 1952 లో కాంగ్రెస్ నియమించిన మిలట్రీ పాలకుడు మనవాళ్ళకు భాషరాదన్న నెపంతో ఉద్యోగాలన్నీ స్థాని కేతరులకిచ్చి స్థానికులకు తీరని అన్యాయం చేశాడు. రగిలి పోయిన విద్యార్థి లోకం నిరసన వ్యక్తం చేస్తే సిటీకాలేజి దగ్గర కాల్పులు జరిపి కొంతమంది విద్యార్థులను మట్టుబెట్టాడు. నాటి నుండి మొదలైన కాంగ్రెస్ రక్తదాహం తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా కొనసాగింది. వందలాది మంది చావుకు కారణమైంది. చెన్నారెడ్డిని నిస్తేజుడిని చేసి, 370 మంది విద్యార్ధులను పొట్టన పెట్టుకుని తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చారు.

ఇవన్నీ గుణపాఠంగా తీసుకున్న బాపు కేసీఆర్ రాజ్యాంగ బద్ధంగా ఉద్యమం నడిపించాడు. పోరాటాన్ని పల్లెల్లోకి పాకించి, పల్లెప్రజల్లో చైతన్యం తెచ్చాడు. సాంస్కృతిక కార్యక్రమాలతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని పల్లెప్రజలకు అర్థమయే రీతిలో కళ్ళకు కట్టినట్టుగా వివరించాడు. చైనాలో జరిగిన సాంస్కృతిక విప్లవం తరహాలో తెలంగాణలో భావజాల వ్యాప్తి జరిగింది.

బాపూ తనయ కవితక్క మన తెలంగాణ బతుకమ్మను ఒక పోరాట రూపంగా ఎంచుకుంది. లక్షలాది మహిళలను కూడగట్టి బతుకమ్మ ఆడించింది. ఇలా.. అన్నిరంగాల్లోకి తెలంగాణ ఉద్యమం చొచ్చుకు పోయింది. శత్రువు చేష్టలుడిగి చూస్తుండగా తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం బాపు కేసీఆర్ను తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది.

నవనవోన్మేష భావ
నవ జీవన చైతన్యం
బాపు దార్శనికతకు
ప్రత్యక్ష నిదర్శనం…!
నింగినంటు ఔన్నత్యం
విశాలమే సాంగత్యం
మొక్కవోని ధైర్యానికి
ప్రతీకగా అభిని వేశం..!
ఆలోచన అనుశాసన
ఆవేదన, అభినందన
అణగారిన వర్గాల
అభివృద్ధి. చిత్తశుద్ధి !
ఆప్యాయత మిళితమైన
ఆలింగనతో స్వాంతన
మూర్తీభవించిన
వ్యక్తిత్వం మన బాపూ!
చెరిగిపోదు… తరిగిపోదు
శిరోధార్యమైన చరిత
మాసిపోదు మలిగిపోదు
మహానుభావుని ఘనత..!

బాపు కేసిఆర్ ఉప ఎన్నికలను ఒక ఆయుధంగా మలిచాడు. వలసవాద పార్టీలను మట్టికరిపించాడు. ప్రజలు గులాబీ జెండాను గుండెలకు హత్తు కున్నారు. వలసపాలకులు ఎన్ని ఎత్తులు వేసినా బాపు కేసిఆర్ వాళ్ళ ఆలోచనలకు అందనంత ఎత్తుకు ఎదిగాడు. చెన్నారెడ్డి నిస్తేజుడైన చోటనే.. బాపు కేసీఆర్ విస్ఫోటనమై పేలాడు. పోరాడి సాధించుకున్న తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడు. జనరంజక పాలన అందించాడు. తమ దోపిడికి అడ్డు కట్ట వేసినందుకు వలస దోపిడిదారులు పగతో రగిలిపోయారు. ఆరునెలలకే ప్రభుత్వాని కూలదోయ జూశారు. అపరచాణక్యుడైన బాపుకేసిఆర్ ముందు వాళ్ళ ఆటలు సాగలేదు.

చెరువులన్ని నీరు నిండి
కరువు దీరా పంటపండి
చేతినిండా డబ్బులుండి
పరువు లెత్తిన తెలంగాణా..
కర్షకులకు కార్మికులకు
వర్షములతో హర్షమొంద
బాపు కేసీఆర్ యిచ్చిన
భాగ్యవంతపు నజరానా…
రైతుబంధుతో కడుపునిండి
రైతువదనం వెలుగుపండి
రైతు భీమా యనగ దండి
కేసిఆర్ మాముందు నుండి
తీర్చిదిద్దిరి నాళ్ళ నుండి. .

చెరువుల్లో నీళ్ళు మత్తడి దుంకుతున్నంత దూరం బాపు కేసిఆర్ యాదికుంటాడు. వరి గొలుసులు విరగకాస్తున్నంత మార్గం బాపును మదిలో వెక్కుతుంటారు . నగరం నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం దారి చూపుతున్నంత కాలం బాపూ కేసిఆర్ వెలుగుతుంటాడు. మాట తప్పని మడమతిప్పని పోరు చేసి బంగారు తెలంగాణకై అస్తిత్వ బావుటాను ఎత్తిన ధిక్కారస్వరం.

36 జిల్లాలు, అంబేద్కర్ సచివాలయం.125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం, అమరవీరుల స్థూపం. బతుకమ్మ పండగ ప్రాశస్త్యంగా మహిళలకు చీరల పంపిణీ మిషన్ కాకతీయ మిషన్ భగీరథ, కాళేశ్వరం, రైతుబందు, రైతు భీమా రైతుకు ఉచిత విద్యుత్, దళిత బంధు, బి.సి, బంధు, జిల్లా కొకవైద్యకళాశాల, వృద్ధులకు కంటి వెలుగు, ఆసరాపింఛన్లు, పురిటికి కేసిఆర్ కిట్ తెలంగాణలో పుట్టిన ఆడపిల్లకు పుడుతూనే 13 వేలు, మగబిడ్డకు 12 వేలు నజరానా, బాలింతకు న్యూటిషన్డ్ ఫుడ్, వ్యవసాయ
దిగుబడుల ధాన్యాగారాలు, విత్తనపు వంగడాల సరఫరా…. ఇలాఎన్నో ఎన్నెన్నో ఒకటా రెండా 365 పథకాలు కేసీఆర్ మస్కిష్కంలోంచి పుట్టిన మానసపుత్రికలు. తెలంగాణ కీర్తిని నలుదిశలా చాటాడు. హైదరాబాదు ఐ.టి. ని ప్రపంచంలో మేటిగా సంక్షేమంలో సంక్రాంతిగా.. అభివృద్ధిలో యుగాదిగా అగ్రభాగాన నిలిపిన బాపు మన కేసీఆర్!

గులాబి పార్టీ కి గుండె తానై

తెలంగాణ రాష్ట్రం ఊరికినేరాలేదు. ఎవరూ అడగలే! అడిగినా పట్టించుకోలే ! జై తెలంగాణ అంటేనే వేటాడిండ్రు! తెలంగాణ పదమెత్తితే నేరమైనట్లు అచేతనావస్థలో ఊపిరి సలుపుని తెలంగాణలోకం, అన్నదాతల ఆత్మహత్యలు, చావులతో తెల్లారుతున్న రోజులవి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో…

తెలంగాణ ఉనికిని భుజాన ఎత్తుకుని ఎండిన బీళ్ళన్నీ కలయతిరిగి కంటనీరు పెట్టిండు మన బాపు కేసిఆర్ ! వీధులన్నీ తిరిగి తెలంగాణ జెండాలను నాటి జై తెలంగాణ అనిపించిండు. తెలంగాణ సాధనకై ఎక్కని గుడి, మొక్కనిదేవుడు లేదు. ఎవరేమి అన్నా తెలంగాణకై ముందుకు కదిలాడు. వెన్ను చూపని యోధుడిగా, తెలంగాణ వాదిగా, నాయకుడిగా, సాధకుడిగా తెలంగాణ బాపుగా చరిత్రలో నిలిచాడు. ఒకతపన, ఒక పట్టుదల, తలవంచని ధీరత్వం తెలంగాణ నేలను కబళిస్తున్న పెట్టుబడిదారుల నుండి స్వేచ్ఛా పొయువులు ఊదిన కొదమ సింగం బాపు. తన మాట, పాట, పద్యం పలుకు జలించే చైతన్యపు ఉద్యమశ్వాసగా నిలిచాడు బాపు.

పెంచిన కరెంట్ ఛార్జీలు అన్నదాతల అప్పులు. రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కోతలను నిరసిస్తూ, – అసెంబ్లీ ముట్టడించిన వామపక్షాలపై కాల్పులు. ముగ్గురి మరణంతో.. డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కేసీఆర్ ఈఘటనకు తీవ్రంగా కలత చెంది చంద్ర బాబుకు బహిరంగ లేఖలో చుక్కలు చూపించారు ఏడాదిన్నర ఆచరణతో అధ్యయనం చేసి ఆచార్య జయశంకర్ నీళ్ళు నిపుణులు విద్యాసాగరావు, వి.ప్రకాష్ తదితరులతో చర్చలు జరిపారు. జలదృశ్యంలో తెలంగాణ అస్థిత్వ బావుటా ను ఏప్రిల్-27- 2001 న ఎగుర వేసిన రోజు! జలదృశ్యంలో తెలంగాణ పతాక రెపరెపల్ని చూసి చంద్రబాబుకు బైర్లు కమ్మాయ్) ఉద్యమాన్ని విధ్వంసం చేయడానికి శతవిధాల ప్రయత్నించాడు. తెలంగాణ దీప శిఖను ఆర్పడానికి సమస్త శక్తులన్నీ, ఏకమైనా ఉద్యమ కాగడాను దించలే జండాను ఎగరేస్తూ, సమీకరిస్తూ, బోధిస్తూ, పోరాడుతూ… అంబేద్కర్ స్ఫూర్తితో ట్యాగ్ లైన్ – నీళ్లు – నిధులు- నియామకాలు | అంటూ తెలంగాణ బిడ్డలను జాగృతం చేసిన బాపు ! “నేను తెలంగాణ ఉద్యమ తోవ తప్పితే రాళ్ళతో కొట్టండి” అని ఎలుగెత్తిన బాపు కేసిఆర్ !

కరీంనగర్ సింహగర్జన అనంత దిగంతాల ఉత్సాహం. టి.ఆర్.ఎస్. ఇక వెనుదిరిగి చూడలేదు. పది జిల్లాలు తాలూకాల బహిరంగ సభలు. వరంగల్ సభకు ఇరవై ఐదు లక్షల జనం హాజరు కావడం చరిత్రలో ఒక రికార్డు. అది బాపు కేసిఆర్ కే దక్కింది. మృత్యువు నోట్లో తలపెట్టిన సాహసం ఆమరణ నిరాహారదీక్షకు సమర శంఖం పూరించిండు. బాపు దీక్ష ఆంధ్రాధిపత్య గుండెల్లో పణుకు పుట్టింది. కేసిఆర్ దీక్షాస్థలికి బయిలుదేరిన కొద్దీ సమయంలోనే అడ్డంకులతో అరెస్టు చేసి, కాంగ్రెస్ నాయకులు తోడేళ్ళ బుద్ధిని ప్రదర్శించారు. బాపును ఖమ్మం జిల్లాలో నిర్భందించి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, దెబ్బతీశారు. కేసిఆర్ అరెస్టు వార్త దావానలంలా వ్యాపించి విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు, కళాశాలలు సమస్త ఉద్యమ చౌరస్తాలై అట్టుడికి, విప్లవించి, గర్జించాయి.

శ్రీకాంతాచారి అమరత్వంతో తెలంగాణ దుఃఖించింది. తెలంగాణ దుఃఖాన్ని ఆపుకోలేని బాపు భావోద్వేగానికి గురయ్యాడు. ఎవరూ ఆత్మహత్య చేసుకోరాదు. నిలబడి కలబడి పోరాడుదాం. తెలంగాణను సాధిద్దాం అంటూ విద్యార్థులతో చైతన్య స్ఫూర్తిని నింపాడు. డిశెంబరు 9వతేది తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ఎట్టకేలకు కేంద్రం తలవంచి, ప్రకటించారు. ప్రకటించిన సంతోషం తెల్లారక ముందే నయవంచక కాంగ్రెస్ తన కపటబుద్ధిని బయిటపెట్టుకుంది. సోనియాగాంధీ, చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ, రేశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, లగడపాటి, రాయపాటి జగన్ మోహన్ రెడ్డి, కావూరి సాంబశివరావు, టి.జి. వెంకటేష్ ఒక్కొక్కరు పార్టీలు, సంఘాలు, కమిటీలు పేరున వింత క్రీడలతో ఆడిన సమైక్యాంధ్ర నాటకాలు బాపు ఎత్తులముందు చిత్తు కాకతప్పలేదు. ఎలాంటి పట్టుదలకు పోకుండా, అపోహలకు తావివ్వకుండా రాజకీయ ఉద్యమ జేఏసిని ఏర్పాటు చేసి తెలంగాణ వాదాన్ని ముందుకు పరుగెత్తించాడు. ఉద్యమ పార్టీగా టి. ఆర్ఎ.ఎస్. అనేక పాత్రలను పోషిస్తూ… ఆవిష్కరించింది. అణచివేత, అన్యాయాలపై, ధిక్కారపు బావుటాను ఎగర వేసింది. సీమాంధ్ర పత్రి కలు తాటికాయంత అక్షరాల విష ప్రచారాలకు తెరలేపినా బాపుది మొక్కవోని దీక్ష, అకుంఠిత ప్రయాణం సాగింది.

తెలంగాణ ప్రకటనను వెనుకకు తీసుకున్న తర్వాత తెలంగాణ అంతటా నిరసనోద్యమాలు ఉవ్వెత్తున లేచాయి. ఒక్క రోజు లో స్వప్నం సాకారం కాలేదు. సహస్ర బాహువులతో పద్నాలుగేళ్ళ పోరాటం. 36 పార్టీలతో సంప్రదింపులు, అనుకూల లేఖాస్త్రాలు, తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో దీక్షలు, ధర్నాలు, రోడ్లు, రైలు రోకోలు, రైతు సభలు ఓరుగల్లు పోరు సభలు: అన్ని ప్రాంతాల్లో సాంస్కృతిక ధూంధాంలు జె.ఏ.సి. వేదికలు వెళ్లి విరిసాయి. రాస్తారోకోలు, మానవహారాలు, మిలియన్ మార్చ్లు, సకలజనుల సమ్మెలు, ఉద్యమ బతుకమ్మలు, వంటా వార్పూ, వంటి నిరసనలతో అలుపెరుగని పోరాటం చేసింది టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాపుకేసిఆర్!

2018 ఎన్నికల్లో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి టిడిపి.కుట్రలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకునోటు కేసులో బహిరంగంగా దొరికి పోయిన దొంగలు. విఫల రాష్ట్రంగా చూపాలని కేసిఆర్ చిరునామా లేకుండా చేయాలనే సమైక్యవాద బుద్దికి సాక్ష్యం. ఎన్ని కుప్పిగంతులు వేసినావారి ఆటలు సాగలే. ‘అతి’ ఎక్కిరింపుకు, ప్రతినిందకు ప్రతి విధ్వంసానికి వరంగల్ లో జరగ బోయే 25 ఏళ్ళ పండుగనే సాక్ష్యం. పార్టీ కార్యాలయం, ఇల్లు కిరాయికి లేకుండా చేయాలనుకున్న వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. 10 మందితో ప్రారంభమై 60 లక్షల సభ్యులతో అఖిశాసనసభ నియోజకవర్గాల పార్టీ ఆఫీసులతో విరజిల్లేలా చేసిన ఆద్యుడు బావు కేసిఆర్ !

గాలివానా దుమ్ము ధూళి
కలిసివస్తే బెదురుతామా..!
కలిసికట్టుగ అందరొకటై
తరిమి కొట్టమా దానవులను
మానవత్వం నిలుపుకోమా
మరల బాపును తెచ్చుకోమా !

2023 ఎన్నికల్లో దొంగలంతా ఏకమయ్యారు. డబ్బుల సంచుల వరద పారించారు. తమకున్న మీడియా ఆధిపత్యం ద్వారా బాపుపై దుష్ప్రచారం సాగించారు. అనేక కుట్రలు, కుతంత్రాలలో కేవలం ఒక శాతం ఓట్ల తేడాతో ఓడించారు. వాళ్ళ ఏజెంట్లను గద్దెనెక్కించారు. వాళ్ళ ద్వారా దోపిడి ప్రయోజనాలు నేర వేర్చుకుంటున్నారు. మన తెలంగాణ సంస్థలకు వాళ్ళు చైర్మన్ లుగా నియమించబడుతున్నారు. హైదరాబాదుని చంద్రబాబే నిర్మించాడని ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకుడు అంటుంటే.. మనకు వ్యవసాయాన్ని ఆంధ్ర వాళ్ళే నేర్పించారని పి.సి.సి. అధ్యక్షుడు అంటున్నాడు. బాపు కేసిఆర్ ని అడుగడుగునా అవమానిస్తూ, పరాయి వాళ్ళ పల్లకీలు మోస్తున్న ఈ బానిస నాయకులు యొక్క చర్యలను తెలంగాణ ప్రజలు పంటి బిగువున భరిస్తున్నారు. ఇటీవల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆత్మగౌరవ సమావేశంలో.. ఆంధ్రాఆదిపత్యం ఇంకా నా.. ఇకపై సాగదు అంటూ తెలంగాణ రచయితలు, కవులు దుయ్య బట్టారు. అన్నిరంగాల్లో ఆంధ్రా ఆధిపత్యాన్ని ప్రవేశ పెడుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. భవిష్యత్ లో జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ బాప కెసిఆర్ గెలిపించడానికి తహతహ లాడుతున్నారు. బాపు కేసిఆర్ విజేతగానే చరిత్రలో మిగిలి పోవాలి. తెలంగాణ సమాజం ఉన్నంతవరకు బాపు కేసిఆర్ చరిత్ర ఉంటుంది.

జై తెలంగాణ జై బాపు కేసిఆర్

వరంగల్ రజతోత్సవంతో పార్టీ పునర్వైభవంలోకి అడుగిడి విజయదుందుభి మోగిద్దాం.
జనజాతర ను కళ్ళారా చూద్దాం పద…

  • మంత్రి శ్రీదేవి.
    తెలంగాణ రాష్ట్ర అధికార భాషాసంఘం మాజీ అధ్యక్షురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *