నాగారం రైతు వేదికకు తాళాలే సాక్ష్యం

నాగారం రైతు వేదికకు తాళాలే సాక్ష్యం

నాగారం, మార్చి 3 (విశ్వ న్యూస్): రైతుల అభివృద్ధి కోసం కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన నాగారం రైతు వేదిక సంవత్సరాలు గడిచినా ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడం రైతుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, వ్యవసాయ అవగాహన సదస్సుల కోసం నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం తాళాలు వేసి నిరుపయోగంగా మారింది.

నిర్మాణ పనులు పూర్తయినా అధికారికంగా ప్రారంభించకపోవడంతో వేదిక చుట్టూ ముల్లు చెట్లు పెరిగిపోయి నిర్లక్ష్యానికి గురైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. రైతులకు ఉపయోగపడాల్సిన భవనం ఇలా ఖాళీగా ఉండటం ప్రజాధన వృథా అవుతోందనే విమర్శలకు తావిస్తోంది.

ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా రైతు వేదిక ప్రారంభంపై మాత్రం ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం. ఎన్నికల సమయంలో రైతు సంక్షేమం పేరుతో హామీలు ఇచ్చిన నాయకులు గెలిచిన తర్వాత ఈ సమస్యను పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

రైతు వేదిక ప్రారంభమైతే పంటల సాగు విధానాలు, ఆధునిక సాంకేతిక సలహాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన ఒకే వేదికపై లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు. వెంటనే ప్రారంభోత్సవం నిర్వహించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *