పనిమనుషులే దొంగలు… రూ.2 కోట్ల ఆభరణాలతో పరారీ

పనిమనుషులే దొంగలు…
రూ.2 కోట్ల ఆభరణాలతో పరారీ

హైదరాబాద్‌, మార్చి 17 (విశ్వం న్యూస్ ): హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాలీ భార్యాభర్తలు రూ.2 కోట్ల విలువైన ఆభరణాలతో పరారైన ఘటన సంచలనం కలిగించింది.

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–25లోని ప్లాట్ నంబర్ 305లో వ్యాపారవేత్త అనిరుధ్ రెడ్డి తన భార్య దీపికా రెడ్డితో కలిసి నివాసం ఉంటున్నారు. వీరి ఇంట్లో సుమారు 45 రోజుల క్రితం నేపాల్‌కు చెందిన మహేష్ సాహి, అప్సర సాహి అనే దంపతులు పనిమనుషులుగా చేరారు. కొద్ది రోజుల పాటు నమ్మకంగా పనిచేసిన వారు సరైన అవకాశం కోసం వేచి చూశారని పోలీసులు తెలిపారు.

ఇటీవల అనిరుధ్ రెడ్డి దంపతులు ఊటీకి టూర్‌కు వెళ్లగా అదే అదునుగా భావించిన నిందితులు అర్ధరాత్రి సమయంలో ఇంటి మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం బెడ్రూమ్‌లోని అల్మారాలు, లాకర్లను పగులగొట్టి తెల్లవారుజామున వరకు ఇంట్లో వెతికారు. అక్కడ ఉన్న 8 డైమండ్ నెక్లెస్‌లు, 10 రోలెక్స్ వాచీలు, బంగారు నగలను బ్యాగ్‌లో వేసుకుని పరారయ్యారు.

ఇంటికి తిరిగి వచ్చిన అనిరుధ్ రెడ్డి దంపతులు చోరీ విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *