ఇది మా మొదటి అడుగు
మాత్రమే..సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, ఏప్రిల్ 26 (విశ్వం న్యూస్) : హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. భారత్ సమ్మిట్ వేదికపై మాట్లాడిన ఆయన, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు జరిగిన ఉద్యమం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికలపై సమగ్రంగా వివరించారు.

తెలంగాణ గొప్ప చరిత్రను, ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసిన సీఎం, విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు పోరాటం వల్లే తెలంగాణ సాధ్యమైందని అన్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, ఇప్పుడు ప్రజలు తమ నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంచారని వెల్లడించారు.
ప్రజల ఆకాంక్షల సాధన కోసం తమ ప్రభుత్వం నిబద్ధతగా పనిచేస్తుందని సీఎం స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం దేశంలోనే అతిపెద్ద రుణ మాఫీ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. రూ.20,617 కోట్లు వెచ్చించి 25.5 లక్షల మంది రైతులను అప్పుల నుంచి విముక్తి చేసిన ఘనత తమదేనన్నారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, ఎకరాకు రూ.12,000 ఇన్పుట్ సబ్సిడీ, భూమిలేని రైతుకూలీలకు వార్షిక సాయం వంటి పథకాల వివరాలను వివరించారు. ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనపు బోనస్ కూడా అందజేస్తున్నట్లు చెప్పారు. యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేశామని, తొలి ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం వివరించారు. రాజీవ్ యువ వికాసం ద్వారా లక్షలాది మంది యువతకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు.
మహిళా సాధికారత కోసం రాష్ట్రంలో అనేక చర్యలు తీసుకున్నామని, స్వయం సహాయక బృందాల వృద్ధితో 67 లక్షల మంది మహిళలు భాగస్వాములయ్యారని వివరించారు. కోటి మహిళలను కోటీశ్వరులుగా చేయడం తమ లక్ష్యమని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లక్షలాది గృహాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, ఉచిత గృహ విద్యుత్, రేషన్ ద్వారా నాణ్యమైన బియ్యం, గ్యాస్ సబ్సిడీ లాంటి పథకాలతో ప్రజలకు మద్దతు అందిస్తున్నామని తెలిపారు.

మూసీ నది పునరుద్ధరణ ద్వారా హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీల సరసన నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ వంటి మేటి ప్రాజెక్టులు చేపట్టామని చెప్పారు. భారత్‌లో కుల సర్వే నిర్వహించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని గర్వంగా చెప్పారు. త్వరలో గిగ్, యాప్ వర్కర్ల సంక్షేమ పాలసీ తీసుకువస్తామని తెలిపారు.

“ఇది మా మొదటి అడుగు మాత్రమే… ఇంకా చాలా చేయాల్సి ఉంది. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడం మా మిషన్. మీ అనుభవం, పరిజ్ఞానం, నైపుణ్యాలతో మా ప్రభుత్వానికి తోడ్పడండి. మీరు తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని కోరుకుంటున్నాం,” అంటూ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.
