అటు ఆధ్యాత్మికత..ఇటు ‘సేవ’.!

- స్వర్గీయ బ్రహ్మశ్రీ అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి మార్గదర్శనం
సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న కుమారులు
శ్వేతార్క ఆలయంలో నిత్యాన్నదానం
ఆలయ కేంద్రంగా వైద్య శిబిరాల నిర్వహణ
పేదలకు ఆహార పదార్థాల పంపిణీ
వేసవిలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు

కాజీపేట, ఏప్రిల్ 29 (విశ్వం న్యూస్): హనుమకొండ జిల్లాలోని కాజీపేట పట్టణ కేంద్ర పరిధిలో గల స్వయంభు శ్వేతార్క మూల గణపతి దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుంది. తెలంగాణ రాష్ట్ర విద్వత్ సభ ఉపాధ్యక్షులు.. శ్రీ భద్రకాళి దేవాలయ ఆస్థాన సిద్ధాంతి.. స్వర్గీయ బ్రహ్మశ్రీ ఐనవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి ఈ ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు.. సేవా కార్యక్రమాలను కొనసాగించేవారు. భక్తుల కోసం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం.. నిత్యాన్నదానాన్ని నిర్వహించడం.. వేసవికాలంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం.. నగరంలోని పలు ప్రాంతాలలో అన్నదానాలు చేయడం.. వంటి సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి మరణానంతరం.. ఆయన పుత్రులైన బ్రహ్మశ్రీ రాధాకృష్ణ శర్మ సాయి కృష్ణ శర్మలు ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ భక్తుల ఆదరణను పొందుతున్నారు.

ఆలయ వ్యవస్థాపక చైర్మన్ ఐనవోలు వెంకటేశ్వర్ల శర్మ పర్యవేక్షణలో ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శ్వేతార్కాలయ 27వ వసంతోత్సవాల నిర్వహణ సందర్భంగా ఆలయ నిర్వహకులు బ్రహ్మశ్రీ ఐనవోలు రాధాకృష్ణ శర్మ, సాయి కృష్ణ శర్మలు మాట్లాడుతూ.. తమ తండ్రి.. గురువుగారైన.. స్వర్గీయ బ్రహ్మశ్రీ ఐనవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి గారి మార్గదర్శనంలో.. ఆయన సూచించిన విధంగా.. ఆదర్శవంతమైన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ వసంతోత్సవాలలో భాగంగా నిత్యాన్నదానం చేయడంతో పాటు వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు.. పేద ప్రజలకు అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ కేంద్రంగా మే 2వ తేదీన నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్వేతార్కాలయ 27వ వసంతోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి కార్యకర్తలు, భక్తులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
వార్త….శ్యామ్🖋️