సీనియర్ అసిస్టెంట్ల బదిలీలు, ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి

సీనియర్ అసిస్టెంట్ల బదిలీలు, ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి

విశ్వం న్యూస్ / హైదరాబాద్, ఫిబ్రవరి 26 : తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో సీనియర్ అసిస్టెంట్ల బదిలీలు, ఏసీటీఓ (ACTO) ప్రమోషన్లు తక్షణమే అమలు చేయాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీసీటీఎన్‌జీవోస్) రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ–ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. రఘునందన్ రావు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ—వాణిజ్య పన్నుల శాఖలో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులు దాదాపు పది సంవత్సరాలుగా ఒకే ప్రాంతంలో కొనసాగుతున్నారని, నిర్ణీత కాలంలో బదిలీలు లేకపోవడంతో వారు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు. సాధారణంగా రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ఒకసారి బదిలీలు చేపట్టాల్సి ఉండగా, ఇది అమలుకాకపోవడం వల్ల ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. గతంలో పనిచేసిన కమిషనర్లు ఈ అంశాన్ని గుర్తించినప్పటికీ, ఇప్పటివరకు పరిష్కారం జరగలేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం శాఖ కమిషనర్‌గా ఉన్న ఎం. రఘునందన్ రావు హయాంలో తప్పకుండా సీనియర్ అసిస్టెంట్ల బదిలీలు చేపడతామని హామీ ఇచ్చినట్లు ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. పది సంవత్సరాలకు పైగా ఒకే చోట పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే బదిలీలు చేయాలని ఆయన మరోసారి కోరారు.

అలాగే, శాఖలో సీనియర్ అసిస్టెంట్లకు ఏసీటీఓ ప్రమోషన్లు కూడా తక్షణమే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జాయింట్ కమిషనర్ కార్యాలయాల్లో ఇప్పటికే సీనియార్టీ రోస్టర్ సిద్ధంగా ఉన్నందున, ఖాళీగా ఉన్న ఏసీటీఓ పోస్టులను సీనియార్టీ ప్రకారం భర్తీ చేయాలని కోరారు. ఇటీవల ఏసీటీఓలకు డీసీటీఓ ప్రమోషన్లు ఇవ్వడంతో ఏర్పడిన ఖాళీలు, అలాగే పదవీ విరమణల కారణంగా వచ్చిన ఖాళీలను ఉపయోగించి సీనియర్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ రెండు అంశాలపై ప్రభుత్వం, శాఖాధికారులు వెంటనే చర్యలు తీసుకుంటే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని ముజాహిద్ హుస్సేన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *