ప్రాణాలు తీసిన సరదా
నిజామాబాద్, ఆగస్టు 5 (విశ్వం న్యూస్) : ఎస్సారెస్పీ పర్యటన కోసం వచ్చి ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో పడి మృతి చెందిన నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు బిటెక్ విద్యార్థులు ప్రణవ్ రావు, వేణు యాదవ్ ల ఘటన పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
సంఘటనకు సంబంధించిన వివరాలను ఎస్సారెస్పీ అధికారులతో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు.. ఎస్సారెస్పీ నుంచి కాలువల్లో దిగువకు విడిచే నీటి ప్రవాహ ఉదృతి ఎక్కువగా ఉంటుందని అలాంటి ప్రాంతాలకు దయచేసి ప్రజలెవరూ వెళ్లొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
సరదా కోసం నీటిలో దిగే సాహసం చేయొద్దని కోరారు. కెనాల్ వద్ద ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.