భార్య జ్ఞాపకాలు భరించలేక
ఉరివేసుకున్న ఎస్సై చంద్రశేఖర్

- ఐదు రోజుల్లోనే భార్యాభర్తలిద్దరూ మృతి, ఇద్దరు చిన్నారులు అనాథలు
- కరీంనగర్‌లో హృదయ విదారక ఘటన
- భార్య మృతి బాధ భరించలేక ప్రాణాలు తీసుకున్న ఎస్సై
- కన్నీరు మున్నీరైన సీతంపేట… ఐదు రోజుల్లో రెండు ప్రాణాలు
కరీంనగర్, మార్చి 21 (విశ్వం న్యూస్): కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్య మరణాన్ని తట్టుకోలేక ఓ పోలీస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. భార్య మృతి చెందిన కేవలం ఐదు రోజులకే భర్త కూడా ప్రాణాలు తీసుకోవడంతో రెండు కుటుంబాల్లోనే కాకుండా పోలీస్ శాఖలోనూ దిగ్భ్రాంతి నెలకొంది.
కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న దేశ్ చంద్రశేఖర్ శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. జమ్మికుంట మండలం సీతంపేటలోని తన అత్తవారి ఇంటికి వెళ్లి అక్కడే ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. విధి నిర్వహణలో చురుకుగా ఉండే చంద్రశేఖర్ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం పోలీస్ వర్గాలను కలచివేసింది.
చంద్రశేఖర్ భార్య దివ్య ఐదు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె గత మంగళవారం నొప్పిని భరించలేక గన్నేరు పువ్వుల రసం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న చంద్రశేఖర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆయన వెంటనే ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి దివ్య మృతి చెందింది.
భార్య మరణం తర్వాత చంద్రశేఖర్ తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమెతో గడిపిన జ్ఞాపకాలు, ఆమె లేని లోటు ఆయనను తీవ్రంగా కలచివేసినట్లు తెలుస్తోంది. హనుమాన్ నగర్‌లో నివసిస్తున్న చంద్రశేఖర్ భార్య మృతిని తట్టుకోలేక చివరకు ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు.

ఈ దంపతులకు ఇద్దరు చిన్నారులు ఉండగా, తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడంతో వారు అనాథలుగా మారారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన వారి పరిస్థితి చూసి బంధుమిత్రులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో సీతంపేట గ్రామంలో ఎక్కడ చూసినా శోకసంద్ర దృశ్యాలు కనిపిస్తున్నాయి.