నేడు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు

పువ్వులు, విద్యుత్ కాంతుల్లో గంధంగూడలో శ్రీ జ్ఞాన వేంకటేశ్వర స్వామి శ్రీవారి ఆలయం..
ఘనంగా వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు…
హైదరాబాద్, జనవరి 2 (విశ్వం న్యూస్) : వైకుంఠ ఏకాదశి పర్వదినం నూతన సంవత్సరం ప్రారంభంలో సోమవారం రోజున రావడంతో ప్రత్యేకత, ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. ఈ నేపథ్యంలో హిందూ దేవాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ప్రత్యేక దర్శనానికి వైష్ణవాలయాలలో ప్రత్యేక భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్తర ద్వారా దర్శనం ప్రత్యేకత.. పై వేద బ్రాహ్మ ణులు, శ్రీ వైష్ణవ పూజారులు వైకుంఠ ఏకాదశి పురాణం కథనంపై మాట్లాడుతూ…అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడ వదిలించుకున్నారు. ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివినుంచి భువికి దిగివచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడవాహన రూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగా ఈ పర్వదినం ప్రాశ స్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు “వైకుంఠ ఏకదశీ వ్రతం” ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.
అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామస్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడలో శ్రీ జ్ఞాన వేంకటేశ్వర స్వామి శ్రీవారి ఆలయ కమిటీ పాలకవర్గం, సభ్యులు ప్రత్యేక దర్శనానికి భారీ ఏర్పాటు చేశారు.

