‘అందంగా ఉన్నావు’
డాక్టర్ అసభ్య ప్రవర్తన

తొర్రూరు, మార్చి 15 (విశ్వం న్యూస్): తొర్రూరులోని విజయలక్ష్మి హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్‌పై అసభ్య ప్రవర్తన ఆరోపణలు రావడంతో స్థానికంగా కలకలం రేగింది. జ్వరం చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన యువతితో డాక్టర్ అనుచితంగా ప్రవర్తించాడని బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
సమాచారం ప్రకారం, తొర్రూరుకు చెందిన 21 ఏళ్ల యువతి జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం విజయలక్ష్మి హాస్పిటల్‌కు వెళ్లింది. అక్కడ విధుల్లో ఉన్న డాక్టర్ కిరణ్ కుమార్ ఆమెకు ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం అనుచితంగా ప్రవర్తించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. “నువ్వు అందంగా ఉన్నావు” అంటూ ఆమెను ముట్టుకున్నాడని ఆరోపించారు.
డాక్టర్ ప్రవర్తనతో భయాందోళనకు గురైన యువతి వెంటనే తన తల్లికి వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని యువతిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అనంతరం మరో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఈ ఘటనపై ఆగ్రహంతో బాధితురాలి కుటుంబ సభ్యులు మరుసటి రోజు ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌ను ప్రశ్నించగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు డాక్టర్‌పై దాడి చేసినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డాక్టర్ కిరణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. తొర్రూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.