ఇళ్లు కూల్చడం అమానుషం: ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్

వరంగల్‌, ఫిబ్రవరి 19 (విశ్వం న్యూస్):వరంగల్ నగరంలో దశాబ్దాలుగా నివసిస్తున్న దళిత కుటుంబాల ఇళ్లను కూల్చివేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అత్యంత అమానుషమని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించారు.వరంగల్‌లోని వరంగల్ నగర పరిధిలో, భద్రకాళి ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరబండ రాజు నగర్ కాలనీలో దాదాపు 60–70 సంవత్సరాలుగా నివసిస్తున్న దళిత కుటుంబాల ఇళ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేందుకు ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు.

బుధవారం మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలతో కలిసి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.లగచర్లలో గిరిజనులపై జరిగిన ఘటనలు మరువకముందే, ఇప్పుడు వరంగల్‌లో ‘అభివృద్ధి’, ‘ప్రాజెక్టులు’, ‘మాడ వీధులు’ పేరుతో కనీస డ్యూ ప్రాసెస్ లేకుండా పేదల ఇళ్లను కబ్జా చేసి కూల్చేందుకు ప్రయత్నించడం బుల్డోజర్ రాజ్యానికి నిదర్శనమని డా. శ్రవణ్ విమర్శించారు.

తాగునీటి కనెక్షన్లు కట్ చేయడం, విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని బెదిరించడం ద్వారా కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నించడం అమానుష చర్య అని మండిపడ్డారు. తాగునీరు లేక చిన్నపిల్లలు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొనడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.బాధితులు కలెక్టర్‌, కమిషనర్‌లను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదని తెలిపారు. చివరకు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా, చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ మానవత్వంతో స్పందించి ఇది రాజ్యాంగ ఉల్లంఘన అంశమని అభిప్రాయపడి తక్షణ ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. మార్చి 9న అమలుపై సమీక్ష చేస్తామని కమిషన్ స్పష్టం చేసినట్లు తెలిపారు.

“ఇదేనా ప్రజాపాలన? ఇదేనా జై సంవిధానం? ఇదేనా జై భీమ్?” అంటూ ప్రభుత్వాన్ని డా. శ్రవణ్ ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూల్చే హక్కు ప్రభుత్వానికి లేదని, తాగునీరు నిలిపివేసి బలవంతంగా ఖాళీ చేయించడం ప్రజాస్వామ్యం కాదని, అది నిరంకుశత్వమని విమర్శించారు.తెలంగాణలోని దళిత, గిరిజన సంఘాలు సంఘటితమై ఈ రాజ్యాంగ విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ సహా సంబంధిత అధికారులు మానవ హక్కుల కమిషన్ ఆదేశాలను యథాతథంగా అమలు చేసి దళితుల హక్కులు, మానవత్వాన్ని కాపాడాలని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *