విజన్ జీరో… విజ్డమ్ జీరో

హైదరాబాద్, మార్చి 17 (విశ్వం న్యూస్) : తెలంగాణ శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన స్పష్టమైన దిశా నిర్దేశం లేదని, అది కేవలం మాటలకే పరిమితమైందని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ప్రస్తావన ఒక్కటీ లేకపోవడం బాధాకరమని శ్రవణ్ అన్నారు. అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగం, నెలకు రూ.25 వేల పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు.
రాష్ట్ర జీఎస్డీపీ పెరిగిందని ప్రభుత్వం చెప్పుకుంటున్నా, వాస్తవానికి రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని కాగ్ లెక్కలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదాయం పెరగకపోయినా అప్పులు మాత్రం పెరుగుతున్నాయని ఆరోపించారు. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం చెప్పే లెక్కలు తప్పుల తడక అని శ్రవణ్ తెలిపారు. 67 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నా, అందులో చాలా పోస్టులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే నోటిఫై చేసినవేనని అన్నారు. వాస్తవంగా కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు చాలా తక్కువేనని పేర్కొంటూ దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు కూడా అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాలన్న మహాలక్ష్మి పథకం, రైతు రుణమాఫీ, పాత పెన్షన్ విధానం వంటి హామీలు ఇప్పటికీ అమలులోకి రాలేదని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి జీవో 46 తీసుకువచ్చి అన్యాయం చేశారని శ్రవణ్ ఆరోపించారు. కుల గణన సర్వే వివరాలను కూడా ప్రభుత్వం బయటపెట్టడం లేదని అన్నారు.

మూసీ ప్రాజెక్టు పేరిట పునరావాసం చూపకుండా పేదల ఇళ్లను కూల్చివేయడం దారుణమని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ వద్ద వచ్చిన చిన్నపాటి పగుళ్లను రాజకీయ కక్షతో పెద్ద సమస్యగా చూపిస్తున్నారని ఆరోపించారు. మిస్ వరల్డ్ ఈవెంట్ సందర్భంగా విదేశీ యువతికి వేధింపులు జరిగాయని ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ తరఫున పలు డిమాండ్లు కూడా శ్రవణ్ ముందుంచారు. ఉద్యోగాల నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, బీసీ కుల గణన వివరాలు ప్రకటించాలని, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. అలాగే మూసీ బాధితులకు పరిహారం, అమరవీరుల కుటుంబాలకు హామీల అమలు, మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, మిస్ వరల్డ్ వేధింపులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉంటాయని, కానీ రాజ్యాంగం మరియు ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, తెలంగాణ అభివృద్ధి దిశగా సాగాలని డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ తన ప్రసంగాన్ని ముగించారు.