
- దళితుల హక్కుల పరిరక్షణకు గట్టి అడుగు: తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) కీలక ఆదేశాలు
- దాసోజు శ్రవణ్ సమక్షంలో కమిషన్ ముందు బాధితుల ఫిర్యాదు
హనుమకొండ, ఫిబ్రవరి 19, 2026 (విశ్వం న్యూస్) : చెరబండ రాజు నగర్‌లో నివసిస్తున్న దళిత కుటుంబాలకు తక్షణమే తాగునీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) ఆదేశించింది. చట్టబద్ధమైన హౌస్‌సైట్ పట్టాలు ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలు నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని కమిషన్ స్పష్టం చేసింది.
గౌరవ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలోని కమిషన్ SR నం. 593, 663 / 2026 ఫిర్యాదులపై మధ్యంతర సిఫారసులు జారీ చేసింది. చెరబండ రాజు నగర్‌కు చెందిన సుమారు 30 మంది షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు తాగునీటి సరఫరా నిలిపివేత, ఇళ్ల కూల్చివేత బెదిరింపులు, కుల ఆధారిత వేధింపులు జరుగుతున్నాయని కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇవి సమానత్వ హక్కు, గౌరవప్రద జీవన హక్కులకు విరుద్ధమని కమిషన్ పేర్కొంది.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ మరియు TG-NPDCL అధికారులకు తక్షణమే నీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని, బలవంతపు ఖాళీ చేయింపులు చేపట్టవద్దని ఆదేశించింది. వరంగల్ పోలీస్ కమిషనర్‌ను బాధితులకు రక్షణ కల్పిస్తూ కులవివక్ష ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.
కమిషన్ ఆదేశాల అమలును ముఖ్య కార్యదర్శి, డీజీపీ పర్యవేక్షించాలని కోరింది. సంబంధిత అధికారుల నుంచి నివేదికలు సమర్పించాలంటూ ఆదేశిస్తూ కేసును తదుపరి విచారణ కోసం 09 మార్చి 2026కు వాయిదా వేసింది.
ఈ కేసును దాసోజు శ్రవణ్ కుమార్ సమక్షంలో కమిషన్ ముందు ప్రవేశపెట్టగా, దాస్యం వినయ్ భాస్కర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు, లీగల్ సెల్ ప్రతినిధులు హాజరయ్యారు.