స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం : ట్రస్ట్ చైర్మన్ ఆకుమడుపుల నరేంద్ర స్వరూప్

విశ్వం న్యూస్ / తిమ్మాపూర్, మార్చి 8: కీ.శే. ఆకుమడుపుల రజనీకాంత్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని ట్రస్ట్ చైర్మన్ ఆకుమడుపుల నరేంద్ర స్వరూప్ తెలిపారు. ఆదివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ (ఎల్ఎండి)లో జిల్లా స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థుల భోజన వసతి కోసం ఆకుమడుపుల రజనీకాంత్ సేవా ట్రస్ట్ తరపున 8 క్వింటాళ్ల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ ఆకుమడుపుల నరేంద్ర స్వరూప్, హనుమంతు, కల్లూరి సోమనాదం మాట్లాడుతూ ఆకుమడుపుల రజనీకాంత్ జీవించి ఉన్న సమయంలో అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయం అందించారని గుర్తు చేశారు. అయితే చిన్న వయసులోనే ఆయన అకాల మరణం చెందడం బాధాకరమని, అది తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. రజనీకాంత్ సేవాభావాన్ని స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకార్థంగా నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగించాలనే సంకల్పంతో ఈ ట్రస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించి, విద్యార్థులకు అన్నప్రసాద వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పొన్నాల సంపత్, ఉపసర్పంచ్ కేతిరెడ్డి ఎల్లారెడ్డి, నాయకులు గూగురి నరసింహారెడ్డి, టీఎన్జీవో నేతలు పోలు కిషన్, అంబటి నాగరాజు, ట్రస్ట్ సభ్యులు ఆకుమడుపుల శ్రీనివాస్, ఆకుమడుపుల సంధ్యారాణి, కొట్టాల శ్రీనివాస్, కొట్టాల లక్ష్మీనారాయణ, వార్డు సభ్యులు పొన్నాల తిరుపతి, పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.