అసెంబ్లీ మధ్యలో ఆటలేంటి? – ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు

అసెంబ్లీ మధ్యలో ఆటలేంటి?
ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు

  • చర్చల నుంచి తప్పించుకోవడానికే కొత్త ఎత్తుగడ అని విమర్శ

హైదరాబాద్, మార్చి 26 (విశ్వం న్యూస్) : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కీలకమైన పద్దులు, ప్రజా సమస్యలపై చర్చలతో కొనసాగుతున్న సమయంలో ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైనది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన ప్రభుత్వంపై సెటైర్లు విసిరారు.

సభ నడపడం చేతకాని పరిస్థితిలో ప్రభుత్వం ఆటల పోటీలు నిర్వహించడం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ఇంత సీరియస్‌గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలను క్రీడా మైదానాలకు పంపడం ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. ఇదే విషయాన్ని తాను మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా సరైన సమాధానం ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఇరిగేషన్ వంటి అంశాలపై అసెంబ్లీలో లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పద్దులపై చర్చను త్వరగా ముగించి తప్పించుకోవాలని చూస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేకనే ఇలాంటి కార్యక్రమాలను సాకుగా చూపుతున్నారని అన్నారు.

ముఖ్యంగా ఈ నెల 28, 29 తేదీల్లో ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అసెంబ్లీ సమావేశాల సమయాన్ని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాల్సింది పోయి, కాలయాపన చేసే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు కలిగిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కీలకమైన అంశాలపై చర్చలు జరగాల్సిన సమయంలో ఎమ్మెల్యేలు ఆటలు ఆడితే ప్రజలు ఏమనుకుంటారో ప్రభుత్వం ఆలోచించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *