- మరణించినా మనతోనే..
- కుటుంబం సంచలన నిర్ణయం
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విశ్వం న్యూస్) : రాజకీయ నేత, సీపీఐఎం అగ్రనేత సీతారాం ఏచూరి కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు అంత్యక్రియలు నిర్వహించటం లేదు కుటుంబ సభ్యులు. ఆయన బతికి ఉన్నప్పుడేతాను చనిపోతే.. తన పార్థీవదేహాన్ని వైద్య పరీక్షల కోసం.. వైద్య విద్యార్థుల రీసెర్చ్ కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన పార్థీవదేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి దానం చేయనున్నారు కుటుంబ సభ్యులు.
మెడికల్ కాలేజీకి ఆయన పార్థీవదేహాన్ని అప్పగించే ముందు.. ఢిల్లీలోని తన ఇంట్లో నివాళులు అర్పించనున్నారు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, నేతలు. అనుచరులు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో నివాళులు అర్పించిన తర్వాత.. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించకుండా.. ఆ పార్థీవదేహాన్ని ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి డొనేట్ చేయనున్నారు కుటుంబ సభ్యులు.
సిపీఐ(ఎం).. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ పార్టీ.. ఈ పార్టీలో ప్రముఖంగా వినిపించే పేరు సీతారాం ఏచూరి. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేతగా ఎంతో గుర్తింపు పొందారు ఆయన. రాజకీయాల్లో ఓనమాలు దిద్దిన పార్టీలోనే.. తుది శ్వాస వరకు ఉన్న లీడర్..!! స్టూడెంట్ లీడర్ గా రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించి.. ఆ పార్టీకి జాతీయ నేతగా ఎదిగారు. ప్రస్తుతం సీపీఐ ఎం పార్టీకి సెక్రటరీ జనరల్ హోదాలో ఉన్న సీతారాం ఏచూరి.. 72 ఏళ్ల వయస్సులో.. అనారోగ్యంతో కన్నుమూశారు.
ఏచూరి రాజకీయ ప్రస్తానం క్లుప్తంగా..
ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలోని తెలుగు కుటుంబంలో జన్మించారు . ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి, తల్లి కల్పకం ఏచూరి వీళ్ల స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ. తండ్రి ఏపీఎస్ఆర్టీసీలో ఇంజినీర్ గా, తల్లి ప్రభుత్వ అధికారిగా పని చేశారు. ఏచూరి బాల్యం హైదరాబాద్ లో సాగింది. పదో తరగతి వరకు హైదరాబాద్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో చదువుకున్నారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన ఢిల్లీ వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్ లో చేరారు. సీబీఎస్ఈ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్‌లో ఆల్-ఇండియా మొదటి ర్యాంక్ సాధించాడు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ(ఎకనామిక్స్), జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఎంఏ చదివారు. పిహెచ్‌డీ కోసం జెఎన్‌యులో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో అతని అరెస్టుతో అడ్మిషన్ రద్దయింది.
ఎస్‌ఎఫ్‌ఐ ద్వారా రాజకీయాల్లోకి..
1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) లో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ మరుసటి ఏడాదే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సభ్యునిగా చేరారు. అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నాయకునిగా సీతారాం ఏచూరిమూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు.