పార్టీలు మారే, (కపట) నాయకుల వల్ల ఎవరికి ప్రయోజనం

హైదరాబాద్, జూలై 30 (విశ్వం న్యూస్) : పార్టీలో పదవులు అనుభవించి….. సుదీర్ఘంగా రాజకీయ ప్రయోజనాలు పొంది…. కష్టాల్లో ఉన్నప్పుడు పెంచి, పెద్ద చేసి తమ స్థాయిలను బట్టి ఎన్నో అవకాశాలను కల్పించిన పార్టీని వదిలిపోవడం… ఈ లుచ్చా రాజకీయ నాయకులకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ ఇలాంటి నాయకులు తమ పొట్టగూటి కోసం, తమ స్వార్థప్రయోజనాలు, లాభాలు పెంచుకోవడం, అనుభవించడం కోసం, బాధ్యతారాహిత్యంగా డబ్బు ఉందని అహంకారంతో ఈరోజు ఈ పార్టీలో… మరోరోజు ఏ పార్టీలో అన్న చందంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నమ్మిన కార్యకర్తలను, ప్రజలను నట్టేట ముంచిపోయే దౌర్భాగ్యులు, కుసంస్కారులు, సంస్కారహీనులు, శవాలపై చిల్లర మరియు బొంగులు ఏరుకొని తినే లుచ్చాగాల్లు… తూ…మీ… బతుకు చెడ…

తక్కెడ లోని కప్పల్లాగా, బొక్క కోసం వెంపర్లాడే కుక్కల్లాగా మరియు గుంటకాడి నక్కల్లాగా తమ అవసరాల కోసం జంపింగ్ జిపాంగ్ చేసే నాయకులతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది నేడు.

ఇలాంటి దొంగా నాయకులు ప్రజల కోసం… ప్రజాసేవ చేయడం కోసం…. రాజకీయాల్లో వచ్చాము …వస్తున్నామని చెప్తే ఎలా నమ్మడం…. ప్రజలకు మేలు చేసే పనిలో పార్టీలు మారుతున్నామని చెప్పడం గొప్ప విషయం, గొప్ప ఘనకార్యంగా మారిపోయింది. ఈమధ్య …ఇలాంటి దొంగ రాజకీయ నాయకులకు చెప్పులతో కొట్టిన బుద్ధి రాదు…. ఈసారి ఎన్నికలలో ఓడగొట్టి ….ఎలాంటి పదవులు రాకుండా శాశ్వతంగా ఇంట్లో కూర్చోబెడితే….. గాని రాష్ట్రంలో దేశంలో ఇలాంటి ఆయారాం.. గయారాం నాయకులకు బుద్ధి రాదు..

రాజకీయ నాయకుడు అంటే నమ్ముకున్న పార్టీ కోసం….. సిద్ధాంతం కోసం….. రాజ్యాంగ సంస్థలపై నమ్మకంతో ప్రజలకు శాసన సభ ద్వారా ప్రయోజనాలు, అభివృద్ధి, సంక్షేమం, ప్రజల సమస్యలు, కష్టాలు వాటి నుండి బయటపడే విధంగా ఉత్తమ రాజకీయ నాయకుడిగా మన ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, దేశంలో ప్రజా భాగస్వామ్యం పెంచి అట్టడుగు పేద వర్గం నుండి ఉన్నత వర్గంలో పేద వాళ్లకు మేలు చేసే ప్రభుత్వ పథకాల రూపకల్పనలో నిర్మాణాలు,ప్రక్షాళన, బందు ప్రీతి, అవినీతి, అన్యాయాలకు, కబ్జాలకు, రౌడీయిజం, గుండాయిజాలకు పాల్పడకుండా, ప్రజలతో అధికారులతో మర్యాదగా వ్యవహరిస్తూ అధికార మదం ఎక్కకుండా, ప్రజాసేవే పరమావధిగా తమ స్థాయిలో వచ్చిన పదవులకు, పార్టీలో నాయకత్వ బాధ్యతలకు సక్రమంగా నిర్వర్తించి… కడవరకు ఆపత్కర, విపత్కర ప్రజా వ్యతిరేక సందర్భం వచ్చినంత వరకు అవకాశం కల్పించే పార్టీకి అండగా ఉండడమే నిజమైన నాయకుడి లక్షణం…… అలాంటి వాళ్లే ఆశయం కోసం….. అభివృద్ధి కోసం పనిచేసే వాళ్లు…… ఇలాంటి లక్షణాలున్న నాయకులనే గెలిపించాలి… వారికి అండదండలు ఇస్తూ, రక్షణ వారధి గా నిలవాలి.

మంచి చేయాలనే వాడికి ఒక పార్టీ సరిపోదా…, ఏ పార్టీలలో లేకున్నా ఈ దేశ ప్రజలకు సేవ చేస్తున్న ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. కానీ దొడ్డిదారిలో సంపాదించిన సంపద, ఆస్తులను కాపాడుకోవడానికి, పన్నులు ఎగ్గొట్టడానికి, నేర చరిత్ర, బలమైన కేసుల నుండి తమను తాము కాపాడే, రక్షించేవి రాజకీయాలు అని నమ్మి పునరావాస కేంద్రంగా మార్చుకొన్నారు. నిజంగా రాజకీయాలు చేయాలనుకునే వారికి, ప్రజా సేవకు అంకితమైన నాయకులకు అవకాశాలు రాకుండా చేస్తున్నారు. వ్యాపారులు, రియల్ ఎస్టేట్ లో అప్పనంగా సంపాదించిన దొంగలు. పన్నులు ఎగ్గొట్టే కంపెనీ యజమానులు, ప్రజలను నిలువునా దోచుకునే విద్యా, వైద్యం పేరుతో వ్యాపారం చేసే అక్రమార్కులు ప్రజా సేవా ముసుగులో ఓట్లను కొని పదవులు, అధికారం,హోదా దర్జాగా అనుభవిస్తున్నారు. దొంగలు దొరల్లాగా చలామణి అవుతున్నారు.

స్వాతంత్రం వచ్చిన తర్వాత తమ ప్రయోజనాల కోసం ఆలోచించే నాయకులు పార్టీలు మారే ఇలాంటి సంస్కృతి ఉంటే… ఈ దేశం ఇప్పటికీ మళ్ళీ పరాయి పాలనలో మరోసారి పోయేది… అనే విషయాన్ని మేధావులుగా అందరం గుర్తిద్దాం….. ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడుతున్న రాజకీయ నాయకులకు మనలాంటి చదువుకున్న మేధావులు, విద్యార్థులు, యువత, ప్రజా సంఘ నాయకులుగా ప్రజలలో ఇలాంటి నాయకులకు నిలదీయాలి …నిగ్గూ తీసి ప్రశ్నించాలి…. ప్రజలకు అవగాహనపరిచి చైతన్యం నింపి -బుద్ధి చెప్పే ఏకైక ఆయుధం ఓటు.

ఓటు ద్వారానే వీరి చర్యలకు చెక్ పెట్టాలి
ఇలాంటి కంత్రి, జంత్రి, టంకుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు నేర్చిన నాయకుల వల్ల వాళ్ల కుటుంబాలు, వ్యాపారాలు బాగు చేసుకుని బంధువులకు రక్షణగా ఏర్పడి సామాన్యుడికి ఎలాంటి ప్రయోజనాలు రాకుండా చేసే కుట్రలను మనము గమనించాలి…. వాస్తవాలను బోధించాలి.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేదరికంలో మగ్గుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీ లు, ఆర్థికంగా వెనుకబడిన కులాలు ఆత్మగౌరవంతో ఉన్నత స్థాయిలలో జీవించే విధంగా… విద్య.. ఉద్యోగ.. రాజకీయాలలో అవకాశాలు పొందే విధంగా… రాజు కడుపులో రాజు పుట్టే వ్యవస్థ….నుండి ఓటర్ బాక్స్ ద్వారా ప్రజాప్రతినిధులను పుట్టించే వ్యవస్థను నిర్మించి… కేవలం చదువుకున్న వాళ్లకు సంపన్నులకు మాత్రమే ఉండే ఓటు అనే వజ్రాయుధాన్ని భారతదేశంలోని కుల, మత, వర్ణ, లింగ భేదం లేకుండా దేశ ప్రజలందరికీ ఓటు హక్కు అందించి ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని… ఈ దేశ ప్రజలకు అందించడం జరిగింది.

కానీ నేడు ఆ ఓటు విలువ తెలుసుకోకుండా కోటరు మందుకు, బీరుకు, బిర్యానికి, 500 నోటుకు అమ్ముడుపోతే ఇంకా సమస్యల సుడిగుండంలో జీవిస్తూ, పేదరికమే ఒక శాపంగా తరతరాలుగా మారని జీవితాన్ని అనుభవిస్తూ సామాన్య ప్రజల జీవితాల్లో వెలుగులు నిండేది ఎప్పుడు…. బడుగు బలహీన వర్గాల కోసం కలలుగన్న, ఎన్నో త్యాగాలు చేసిన పూలే..సావిత్రిబాయి.. సాహు మహారాజ్, నారాయణ గురు, రామస్వామి, భాగ్యరెడ్డి వర్మ, సర్దార్ పాపన్న, మొయినుద్దీన్, APJ కలాం, సంత్ రామదాసు, బిర్సా ముండా, సంత్ సేవాలాల్ మహారాజ్, కొమరం భీమ్, బసవేశ్వరుడు .. మహనీయుల ఆశయాలు సాధించేది ఎప్పుడు ఆలోచించుకోండి.

ప్రపంచీకరణ ముసుగులో కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలు విద్యా, వైద్యాన్ని వ్యాపారంగంగా మార్చి వారి లాభాల కోసం విద్యలో ప్రపంచస్థాయి టెక్నో, డిజిటల్ వివిధ రకాల సిలబస్ ల పేరుతో ఆకర్షించి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ అదేవిధంగా వైద్యంలో 100 రూపాయలు ఖర్చు అయ్యే వ్యవస్థను వేలు లక్షల్లో ఫీజులు వసూలు చేసి పేద ప్రజలను పీల్చే రక్త జలగలుగా మారాయి. సామాన్య ప్రజలకు అందనంత దూరంగా పోతున్న విద్య.. వైద్య అంగాలలో కనీస వసతులు సౌకర్యాలు పర్యవేక్షణ లేకుండా నామమాత్రంగా నడిపిస్తూ మామ… అనిపిస్తున్న విషయాన్ని కల్లారా చూస్తున్నాం.

75 సంవత్సరాల ఘనమైన ప్రజాస్వామ్య దేశంలో భారతదేశ స్వాతంత్ర ఫలాలు , హక్కులు, కనీస వసతులు, సౌకర్యాలు నోచుకోని పల్లెలు, ప్రజలు, గిరిజన ప్రాంతాలు ఎన్నో నేటికి ఉన్నాయి. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ వల్లనే రాజకీయ పదవులు, అవకాశాలు వస్తున్నాయనే ఇంకిత జ్ఞానాన్ని మరిచి వాటిని అనుభవించే నాయకులు, రాజ్యాంగాన్ని మారిస్తే ఏమవుతది…. అని మాట్లాడడం ఎవరి ప్రయోజనాల కోసం…. ఎవరు పనిచేస్తున్నారు. అగ్రవర్ణ పార్టీలకు బానిసలుగా, తాబేదారులుగా మారిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకుల వల్ల వారి కుటుంబానికి, బంధువులకు మాత్రమే ప్రయోజనం అనే విషయాన్ని ప్రతి ఒక్కరం అర్థం చేసుకోవాలి.

అరే దొంగ రాజకీయ నాయకుల్లారా… మీరు బ్రతకడం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ల పేర్లు చెప్పుకొని ఓట్లు వేయించుకొని అందలమెక్కే మీరు…. ఎప్పటికీ మా వాళ్ళు కాదు… అంబేద్కర్ వారసులు అసలే కాదు… ఎందుకోసమంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై ఎన్ని అఘాయిత్యాలు, అత్యాచారాలు హత్యలు, మా సమస్యలు, కష్టాల గురించి ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు…. చట్టసభలలో… ప్రజా ప్రతినిధులుగా పదవుల్లో ఉండి మీ స్వార్థ ప్రయోజనాల కోసం చట్టాలు, ప్రభుత్వ విధానాలు, పథకాలు రూపొందించుకొని కోట్లకు కోట్లుగా సంపాదించుకోవడమే తప్ప మా గురించి పట్టించుకున్న పాపాన పోరు… ఎన్నికలు వస్తున్నాయంటే మా పల్లెలు తండాలు గూడాలు గుర్తుకొస్తాయి అప్పుడు మాత్రమే ప్రారంభోత్సవాలు చేసి మామ అనిపించి మళ్లీ 5 సంవత్సరాల తర్వాత కనిపించే దౌర్భాగ్యమైన రాజకీయ ఓరవడిని సృష్టిస్తున్నారు. రాజకీయాల్లోకి ప్రజల బ్రతుకులు మార్చడానికి రావాలి… కానీ తమ బ్రతుకులను మార్చుకోవడానికి కాదు.

రాజకీయ పదవి అనేది ఒక అదృష్టం, ఓ వరం ఎందుకంటే ఎంతోమంది పోటీ చేసిన ఎన్నికల్లో నీతో పోటీపడే వారిని ఓడించి… కేవలం నిన్ను మాత్రమే గెలిపిస్తున్నారంటే…. నీ మీద నమ్మకం, ప్రేమ, మా సమస్యలను, కష్టాలను తీర్చే ఓ యోధుడు, వీరుడు, మా అందరి రాజు అని భావించి ఓటు వేస్తారు…. ఇంతటి గొప్ప పదవులకు విలువ లేకుండా చేస్తున్నారు. స్వార్థపూరిత, శరీరమంతా విషంతో నిండిన గోముఖ వ్యాగ్ర రాజకీయ నాయకులు. కానీ నేడు ప్రజల బాగోగుల గురించి ఆలోచించే రాజకీయ నాయకుడు పుట్టడం అరుదుగా మారింది… పుట్టిన వారిని గుర్తించి గెలిపించే సత్తువలేని జనాలుగా బానిసలుగా బ్రతకడం అలవాటుగా మార్చుకున్నారు.

ఈ దేశ దశా దిశలు, నవనిర్మాణం మరియు భవిష్యత్ విద్య వల్లనే సాధ్యం అలాంటి పేదలు చదువుకునే విద్యాసంస్థలు, హాస్టల్లో, రెసిడెన్షియల్ లో మౌలిక సౌకర్యాలు, పక్కా భవనాలు నిర్మించడం చేతకాదు చివరికి కనీస వసతి అయిన టాయిలెట్స్ సరిగ్గా లేక అమ్మాయిలు పడే వేతన అంతా ఇంతా కాదు. ప్రాథమిక, ఉన్నత విద్యాసంస్థల్లో మాస్ కాపీయింగ్ ప్రోత్సహిస్తూ విద్యా ప్రమాణాలను దెబ్బతీస్తూ రాబోయే కాలంలో సామాన్యుడు కూలి నాలి చేసుకునే బానిసలుగా బ్రతికే విద్యా విధానాన్ని ప్రోత్సహించడం… ఈ దేశ ప్రగతికి ,భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారుతుందనే విషయాన్ని దాచి ఉన్నతంగా చదువుకుంటే ప్రశ్నించడం మొదలవుతుంది రాజకీయాలలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు మరియు అవకతవకలను బాధ్యులుగా ఉన్న రాజకీయ పార్టీలను, నాయకులకు బుద్ధి చెప్పే వర్గంగా మారుతుందని గ్రహించిన అగ్రవర్గ పార్టీల నేతలు వారికి లాభాలు వచ్చే సంస్థల్లో మాత్రమే పెట్టుబడులు పెడుతూ వారి బంగారు భవిష్యత్తు నిర్మాణం కోసమే వారి శక్తి యుక్తులు సమకూర్చుకొని పనిచేస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్ లో సరైన ఉద్యోగులు లేక మందులు లేక సకాలంలో వైద్యం అందక పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సందర్భాలు ఎన్నో… రోడ్లు సరిగా లేక రవాణా వ్యవస్థ బాగుపడక పండించిన పంటకు సరైన గిట్టుబాటు లేక పేదరికంలోనే ఉండిపోతున్న రైతన్న కష్టాలు, ఆత్మహత్యల కు బాధ్యులు ఎవరు.

ప్రపంచీకరణలో భాగంగా ప్రైవేటైజేషన్ ప్రోత్సహిస్తూ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ బడుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ లేకుండా ఉపాధి, ఉద్యోగాలలో అవకాశాలు రాకుండా చేస్తూ శాశ్వతంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని నిలిపివేసి ఆర్థికంగా ఎదగనీయకుండా ఒక తరం ఉద్యోగ అవకాశాలు పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆర్థికంగా ఎదిగి రాజకీయాలను, అగ్రవర్ణ పార్టీల నాయకుల ఆధిపత్యాన్ని అడ్డుకోవడం తట్టుకోలేక పోతున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను అమ్ముతూ.. పేద మధ్యతరగతి వర్గాలు జీవించే ప్రాంతాలల్లో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూములను, అడవులను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ కార్పొరేట్ రాజకీయాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది.

ఎవరి స్వార్థం కోసం వారు జీవించడం, తాత్కాలిక ప్రయోజనాలకు అలవాటు పడితే. అగ్రవర్ణ రాజకీయ పార్టీలు అధికారంలో రావడం కోసం ఉచిత పథకాల జాతర ఉచ్చులో పడేసి … సొంతంగా ఆలోచన చేయకుండా మన మనస్సును, మెదడును మార్చి ఆశయం.. ఆదర్శం… వాస్తవ అభివృద్ధి, ప్రగతి లేకుండా తమ వర్గాల ప్రయోజనాల కోసం ప్రాజెక్టుల పేరుతో, కాంట్రాక్టుల పేరుతో ఉన్న బడ్జెట్ మరియు భూములను అప్పగించేసి అప్పుల ఊబిలో కూర్చేసి… ఈ రోజు ఉన్నత స్థానాల్లో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ల పిల్లలను ప్రపంచ దేశాలలో చదివించి, రాజకీయ పదవులను అడ్డం పెట్టుకుని దోచుకున్న సొమ్మును అక్కడ పెట్టుబడి పెట్టి ఆస్తులు కూడబెట్టుకుని… చివరికి ఈ దేశం వదిలి వెళ్లి పోతారు… దేశం, రాష్ట్రం అప్పుల కుప్పగా మారి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై.. ఈ దేశంలో మిగిలిపోయిన పేద, మధ్యతరగతి వర్గాలైన మనము ద్రవ్యవేల్బణం వచ్చి ఏ వస్తువులు కొనలేని స్థాయిలో నిస్సహాయులుగా ఉండి అప్పుడు కూడా ఎవరు అన్నం పెడతారు అని ఆకాశం వైపు చూడాల్సిన దీన బానిస పరిస్థితి మహిళలు వ్యభిచార కూపంలో నెట్టే దుర్మార్గ పరిస్థితులు దాపురిస్తాయి …. ఎందుకంటే ఉదాహరణకు జింబాబ్వే, శ్రీలంక , ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ,వెనిజులా దేశాల పరిస్థితి వస్తుంది జాగ్రత్త… ఈ దేశం గొప్పగా, ఉన్నతంగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉండాలనుకోవడం కలగానే మిగిలిపోతుందనే వాస్తవాన్ని గుర్తించాలి… ఎన్నో తరాల నుండి ఈ దేశంలోనే జీవిస్తున్నాం…. రాబోయే కాలంలో కూడా ఏ దేశంలోనే ఉంటాం ఎందుకంటే మన తాత ముత్తాతలు సంపాదించిన వందల కోట్లు మన దగ్గర లేవు… చావైనా బ్రతుకైనా ఈ దేశంలోనే.

ఏలాంటి రాజకీయ విలువలు లేని కట్టుబాట్లు, క్రమశిక్షణ, అంకిత భావం, నీతి నిజాయితికి పట్టంకటే నాయకులు రాజకీయాలలో ప్రస్తుతం లేరనే విషయం తెలుసు. ఈ దేశం ఆదర్శంగా, ఉన్నతంగా ఎదగాలనే కలలుగానే దేశభక్తులు, మేదావులు, ఉన్నత విద్యావంతులకు, ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలని ఆశించే, పోరాడే ప్రజా సంఘ నాయకులకు విస్మయం కలిగిస్తుంది. నవ్విపోవుదురు గాక నాకేంటి సిగ్గు… సిగ్గు, లజ్జ మానం, మర్యాద వదులుకొని, నేర చరిత్ర, గుండాయీజంతో రాజకీయంలో నాటకాలు మాత్రమే పనిచేస్తాయి… అని నమ్మి వచ్చే వారే రాజకీయ రంగాన్ని ఎన్నుకుంటున్నారు…. ఇలాంటి కపట నాటక రాజకీయ నాయకులను ప్రజా ప్రతినిధి పదవుల్లో గెలిపించి అందలమెక్కిస్తే …. వీళ్ళ కమిషన్ల కోసం పనికిరాని పథకాలు ప్రాజెక్టులు చేపట్టి రాష్ట్రాన్ని, దేశాన్ని వీళ్లు చేసి పోయిన అప్పులకు బాధ్యులము మనమే దానివల్ల వచ్చే పర్యవసనాలకు గురయ్యేది కూడా సామాన్య, పేద, మధ్యతరగతి వర్గాలు అనే విషయాన్ని మరువద్దు…. మరవద్దు…. మరవద్దు…. సిగ్గు, మానం, మర్యాద లేని ప్రజా ప్రధాన సమస్యలను గాలికి వదిలేసిన కపట రాజకీయ నాయకులకు విలువలు లేకుంటే…..ఓటు వేసే మనకన్నా విలువలు, నీతి నిజాయితీ అయినా ఉండాలి అనేది భావన.

రాజకీయాలు పదవులు హోదా శాశ్వతం కాదు ప్రజలకు మనం చేసిన సేవ సహకారాలు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయే విధంగా తీసుకున్న నిర్ణయాలు మాత్రమే.. ఇవే కీర్తి ప్రతిష్టలు తరతరాలుగా మరిచిపోకుండా ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని విషయాన్ని మరిచి స్వార్థంతో తమ ప్రయోజనాల కోసమే రాజకీయాలు అనే విధంగా నేటి రాజకీయాలను మార్చారు. ఒక ప్రజా ప్రతినిధిగా గెలవాలంటే ఎందరో కార్యకర్తల నిర్విరామ కృషి, శ్రమ ఫలితం కానీ కొందరు రాజకీయ నాయకులు కేవలం డబ్బుతో గెలిచాము, గెలుస్తాము అనే రకంగా వ్యవహరిస్తూ ఉండడం గెలిచిన తర్వాత ఎవరిని లెక్కపెట్టకుండా మదమెక్కిన ఏనుగుల తిరగడం చూస్తే నవ్వేస్తుంది. ఈ దేశ స్వాతంత్రం కోసం లక్షల మంది అమరులైనారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వందల మంది ప్రాణాలు ఉద్యోగులు, విద్యార్థులు, కవులు, కళాకారులు విలేకరులు ముందుండి నడిపిస్తే సబ్బండ వర్ణాల ఆదరణ, త్యాగ ఫలితమే ఈ తెలంగాణ. కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడి కొడుకులు కాల్చుకోలేదు, లాటి దెబ్బలు, తూటాలు బాష్పవాయు గోళాలకు కండ్లు, ఒళ్ళు మండిన సందర్భాలు మరియు కోర్టులో కేసులు లేవు… ఆలోచించండి స్వార్ధ రాజకీయ నాయకుల అందలం ఎక్కడంలో సమిధలు అవుతున్నది ఎవరు?….. అందుకే ఆలోచించండి. ఉన్న ఊరిని, కన్న వాళ్లను మరియు బంధుమిత్రులను, ఈ దేశాన్ని వదిలి వేరే దేశాలకు వెళ్లే అంత సంపాద కూడాబెట్టి నోళ్ళము కాదు, బలిసినోళ్ళము అంత కన్న కాదు బీదలం సంపద పెరిగిన తగ్గిన ఈ దేశ మట్టిని, ఆత్మగౌరవాన్ని నమ్ముకుని జీవిస్తున్న మట్టి మనుషులం అందుకే ఈ దేశ గౌరవాన్ని నీల్పాల్సిన బాధ్యత మనలాంటి పేద, మధ్యతరగతి వర్గాలది అనేది వాస్తవం…, ఈ దేశాన్ని మధ్యలో వదిలేసి పోయే వాళ్ళము కాదు.. కాబట్టి ఈ దేశాన్ని,మన ప్రాంతాలను కాపాడుకునే పూర్తి బాధ్యత మనదే.

కావున ఈ దేశ దశ దిశను మార్చే ప్రజాస్వామ్య పునాదులు శాసనసభలకు (అసెంబ్లీ ,పార్లమెంట్, స్థానిక సంస్థలు) పంపే రాజకీయ నాయకులను ఏ పార్టీ వాడో, ప్రజలకు మేలు చేసే పార్టీనా అని ఒకటికి పది సార్లు ఆలోచించి ఏ పాటీ వాడో గుర్తించి, నాయకుడు జననాయకుడా…. పార్టీ నాయకుడా… ఎవరి పక్షంగా ఉంటాడో ఆదిలోనే గుర్తించి ఓటు అనే ఆయుధంతో వీళ్ళ కుట్రలు కుతంత్రాలను పటాపంచలు చేయాలి… అది ఓటుతోనే సాధ్యం.

మారుదాం…. మార్చుదాం…
మెరుగైన రాజకీయం, సమాజం కోసం….,
దేశం కోసం… మన వంతు ప్రయత్నం చేద్దాం….

(కొర్ర ఈశ్వర్ లాల్, PhD, ఓయూ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *