99 రోజుల డ్రామా ఎందుకు?: దాసోజు శ్రవణ్

99 రోజుల డ్రామా
ఎందుకు?: దాసోజు

హైదరాబాద్, మార్చి 6 (విశ్వం న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల యాక్షన్ ప్లాన్పై ప్రజలకు పూర్తి స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ ప్రభుత్వాన్ని కోరారు. గతంలో అమలు చేసిన అనేక ప్రణాళికలు ఆశించిన ఫలితాలు ఇవ్వని నేపథ్యంలో, ఈసారి 99 రోజుల కార్యక్రమాన్ని ఏ ప్రాతిపదికన రూపొందించారో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈరోజు హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు హైదరాబాద్ కలెక్టర్ హరి చందన ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల యాక్షన్ ప్లాన్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశంలో అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎంఐఎం ఎమ్మెల్యేలు మరియు అధికారులు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ 99 రోజుల కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాల వారీగా ఎంత మేరకు బడ్జెట్ కేటాయించారో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. అలాగే ఈ కార్యక్రమం అమలు సరైన విధంగా జరుగుతోందా లేదా అన్నది ప్రజలకు తెలియజేయడానికి స్పష్టమైన పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ రూపొందించి వాటిని ప్రజల ముందుంచాలని సూచించారు.

అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. అనేక ప్రాంతాల్లో దోమల బెడద తీవ్రంగా ఉందని, ఫాగింగ్ కార్యక్రమాలకు కాంట్రాక్టర్లకు అవసరమైన నిధులు కేటాయించాలని అన్నారు. అలాగే అవారా కుక్కల సమస్యపై కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

బస్తీ దవాఖానల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో సుమారు 80 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పరిస్థితి ఉందని, అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని సూచించారు.

ఇక దివ్యాంగుల హక్కుల చట్టం (RPWD Act)ను సమర్థవంతంగా అమలు చేయాలని, రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. డ్రగ్స్ బారినపడిన వారికి చికిత్స, పునరావాసం కల్పించేందుకు రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే SC, ST, BC విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్‌లను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *