సమయానికి రాని 108… ప్రమాదంలో ప్రజల ప్రాణాలు

సమయానికి రాని 108…
ప్రమాదంలో ప్రజల ప్రాణాలు

నాగారం, జనవరి 31 (విశ్వం న్యూస్): నాగారం మండలంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడాల్సిన 108 అంబులెన్స్ సేవలు పూర్తిగా విఫలమవుతున్నాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో పలువురు రోగులు దారిలోనే ప్రాణాలు కోల్పోతున్నారన్న సమాచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

మండలానికి కేటాయించిన 108 అంబులెన్స్ వాహనం అసలు ఎక్కడ ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాహనం పనిచేస్తుందా? లేక కేవలం కాగితాలకే పరిమితమైందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర సమయంలో 108కు ఫోన్ చేస్తే స్పందన లేదని, లేదా గంటల తరబడి ఆలస్యంగా వస్తోందని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి.

ఈ పరిస్థితికి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమా? లేక ప్రజా ప్రతినిధుల రాజకీయ మౌనమా? అంటూ స్థానికులు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు, ఫ్లెక్సీలు, ప్రకటనలకే పరిమితమవుతున్నాయని, కానీ ప్రజల ప్రాణాల విషయంలో మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నాగారం మండలానికి పూర్తి స్థాయిలో 108 అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈ నిర్లక్ష్యం మరిన్ని అమాయక ప్రాణాలను బలితీసుకునే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *