నాగారం మండలంలో అధికారిపై తీవ్ర ఆరోపణలు
ఎన్నికల వ్యయాల
పేరుతో దండుకో?

నాగారం, ఫిబ్రవరి 1 (విశ్వం న్యూస్) : ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం నాగారం మండలంలో ఎన్నికల వ్యయాల పరిశీలన పేరుతో అక్రమ వసూళ్లు జరిగాయన్న ఆరోపణలు తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తున్నాయి. ఎన్నికల నిబంధనలను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న విమర్శలు మండలవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికల వ్యయాల పరిశీలన అధికారిగా నియమితులైన ఒక అధికారి, ఖర్చుల వివరాల్లో తానే తుది నిర్ణయాధికారి అన్నట్లుగా వ్యవహరిస్తూ నూతనంగా ఎన్నికైన సర్పంచులను భయబ్రాంతులకు గురిచేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేశాడన్న సమాచారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఖర్చుల నివేదికల్లో అభ్యంతరాలు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడి ఈ వసూళ్లు చేసినట్టు సర్పంచులు వాపోతున్నారు.
ఈ వ్యవహారంపై ఒక నూతన సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తూ, “నిబంధనల ప్రకారమే ఖర్చుల వివరాలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ అభ్యంతరాలు పెడతామంటూ భయపెట్టి డబ్బులు అడగడం అన్యాయం,” అని తెలిపారు. మరో గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి మాట్లాడుతూ, “ఎన్నికల్లో గెలిచిన వెంటనే అధికారుల నుంచే ఇలాంటి ఒత్తిళ్లు ఎదురవడం బాధాకరం. ఇది ప్రజాస్వామ్యానికి అవమానం,” అని మండిపడ్డారు.
మండలంలోని 14 గ్రామ పంచాయతీల నుంచి సుమారు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసి ఉండవచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక గ్రామానికి చెందిన స్థానికుడు మాట్లాడుతూ,
“ఇదివరకే ఆరోపణలపై బదిలీ అయిన అధికారినే మళ్లీ అదే మండలంలో కీలక బాధ్యతలో నియమించడం వెనుక ఉద్దేశమేంటి?” అని ప్రశ్నించారు.
ఈ ఘటన కేవలం అక్రమ వసూళ్లకే పరిమితం కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యగా మారుతోందని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
