పంచాయితీ సెక్రటరీల ఉద్యోగాలను
వెంటనే రెగ్యులరైజ్ చేయాలి
- జెపిఎస్, ఓపిఎస్ అని వారిని విభజించి సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు
- టెంటు వేసుకొనివ్వకుండ పోలీసులచే బెదిరింపులకు పాల్పడడం ఎంటి? సమ్మె చేస్తున్న మహిళలు ఎండకు సొమ్మసిల్లి పోతున్నారు
కరీంనగర్ బ్యూరో, మే 2 (విశ్వం న్యూస్) : నాలుగు సంవత్సరాల క్రితం ఉద్యోగంలో చేరిన పంచాయితీ సెక్రటరీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా నామమాత్రపు జీతాలతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు.కలెక్టరేట్ ఎదుట పంచాయితీ సెక్రటరీలు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రోహిబిషన్ పీరియడ్ అయిపోయినప్పటికి రెగ్యులరైజ్ చేయకుండా వేధిస్తున్నారని వారిని విభజించి జూనియర్ పంచాయితీ సెక్రటరీలు,ఔట్ సోర్సింగ్ పంచాయితీ సెక్రటరీలు అని చీలిక తెచ్చి సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా నియమితులైన వీరిని ఈ విధంగా వేధించడం భావ్యం కాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది లక్షలమంది పోటీ పరీక్షలో పాల్గొంటే తొమ్మిది వేలమందికి మాత్రమే ఉద్యోగాలచ్చాయని అంత మందిలో కష్టపడి ఉద్యోగం సాధించిన వారిని రెగ్యులరైజ్ చేయకుండా వేదించడమేంటని ప్రశ్నించారు. టెంటు వేయనీయ కుండా పోలీసులతో బెదిరిస్తున్నారన్నారు.
ఎండకు మహిళ ఉద్యోగినులు సొమ్మ సిల్లిపోతున్నారని అన్నారు.వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. పున్నం కిరణ్ కుమార్, ప్రభాకర్, ప్రేమ్ కుమార్, శేకర్, వాహెద్, మమత, సరిత, శిరీష్ తదితరులు పాల్గొన్నారు.