ప్రాణాన్నిరక్షించిన రక్షక భటులు
ఉద్యోగ ధర్మమే అంటున్న పోలీసులు
జమ్మికుంట, మే 4 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణ పరిధిలోని రైల్వే పట్టాలపై ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న ఒక వివాహితను సరైన అవగాహనతో చేరుకొని ప్రాణాలు కాపాడిన జమ్మికుంట పోలీసులు. వివరాల్లోకి వెళితే జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ గ్రామానికి చెందిన పుష్యాల శ్రీలత (32) కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉందన్న సమాచారం స్థానిక బ్లూ కోట్ పోలీసులకు అందిన వెంటనే సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సారంగదరి, హోమ్ గార్డ్స్ ఆనంద్, జలీల్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మహిళా ప్రాణాలను కాపాడినట్లు జమ్మికుంట సి.ఐ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
అనంతరం సి.ఐ మాట్లాడుతూ క్షణిక అవేశంలో ఆత్మహత్య వంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని, అవేశంలో తీసుకునే నిర్ణయం పట్ల మీ ప్రాణాలు పోవడమే కాకుండా మీ కుటుంబాన్ని దిక్కులేని వాళ్ళను చేసిన వారవుతారని హితువు చెప్పారు.
కుటుంబంలో ఏ సమస్య ఉన్నా నిదానంగా కూర్చుని పరిష్కరించుకోవాలని లేని యెడల తమ వద్ధకు రావాలని తగిన పరిష్కారం చూపెడతామని సి.ఐ తెలిపారు. శ్రీలత కుటుంబ సభ్యులను పిలిచి వారికి కౌన్సలింగ్ నిర్వహించి ఆమెను వారితో పంపినట్లు సి.ఐ తెలిపారు. మహిళా ప్రాణాలను కాపాడిన సిబ్బందిని సి.ఐ అభినందించారు.