బీజేపీలో చేరిన జయసుధ

ఢిల్లీ, ఆగస్టు 2 (విశ్వం న్యూస్) : తెలుగు నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బుధవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర శాఖ చీఫ్ జి కిషన్ రెడ్డి సమక్షంలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.

కిషన్ రెడ్డి ఆమెను కలిసి అధికారికంగా ఆహ్వానించిన కొద్ది రోజులకే జయసుధ బీజేపీలో చేరారు. ఆమె బీజేపీలో చేరబోతున్నారని గత ఏడాది కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా జయసుధను కలిసి పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు.
ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు పార్టీ టిక్కెట్టు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆమె ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది.