- (కుల గణనతోనే బీసీ లకు న్యాయం)
హైదరాబాద్, ఆగస్టు 8 (విశ్వం న్యూస్) : పరాయి పాలకుల దోపిడి నుంచి విముక్తి కోసం, నీటి కోసం, నిధుల కేటాయింపు కోసం కోట్లాది ప్రజల ఆకాంక్షలు నెరవేరేందుకు ప్రత్యేక తెలంగాణ సాధించి దశాబ్దం గడిచిపోయింది. అన్ని ప్రజా సంఘాలు పోరాడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు ఆశించిన స్థాయిలో నెరవేరలేదు ఇది ముమ్మాటికీ నిజం. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో విజయం సాధించేందుకు జనాభాలో 56 శాతం ఉన్న బీసీ సామాజికవర్గం మద్దతుపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.
బీసీ ఓటు బ్యాంకు వ్యూహ రచనలు పోటీ
రాజకీయ పార్టీలు పోటీ పడి బీసీ మంత్రాన్ని జపిస్తున్నాయి. బీసీ డిక్లరేషన్లు ప్రకటించడంలో పోటీ పడుతున్నాయి బీసీల కుతాయిలాలు ఉచితాలు’ పథకాల పబ్లిసిటీ కి పాల్పడుతున్నాయి. బీసీలను ఓటు బ్యాంకుగా చేసుకుని అధికారాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచించడంలో పోటీ పడుతున్నారు. రాజకీయ పార్టీల మాయమాటల్లో బీసీ వాదం బంధించబడింది. ఎన్నికల సమయంలో బీసీ నినాదాలు చేయడం, ఎన్నికలు ముగిసిన తర్వాత నినాదాలు చేయడం మానేయడం ఆనవాయితీ గా వస్తుంది.
బీ సీల నాయకత్వం నిర్లక్ష్యం
ఎన్నికల ముందు బీసీ ఓట్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఎన్నికల అనంతరం ఆయా పార్టీల రాష్ట్ర జిల్లా స్థాయి కార్యవర్గాల్లో బీసీ నేతలకు ముఖ్యమైన పదవులు కట్టబెట్టడంలో రాజకీయ పార్టీలన్నీ మొండికేస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు బీసీలకు టిక్కెట్లు
రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరగనుంది.బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్.అనేక ప్రకటనలు చేస్తుంది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయిస్తామని పలు బహిరంగ సభల్లో ప్రకటిస్తూనే మరోవైపు సీనియర్ బీసీ నేతలకు ఎన్నికల కమిటీల్లో కీలక బాధ్యతలు నిరాకరిస్తూ.. సరైన గుర్తింపుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అంతర్గత కలహాలు, వర్గ విభేదాలు ఆధిపత్య పోరులో కూరుకుపోయి ప్రభుత్వ విధానాల వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో, ప్రజల్లో విశ్వాసం నింపడంలో విఫలం కావడం శోచనీయం.
కాంగ్రెస్ బీసీ పాలసీ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు 50 శాతం సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న సంగతి తెలిసిందే. బీసీ అభ్యర్థులకు 40% రిజర్వేషన్లు పెంచే ఆలోచన కూడా పార్టీలో ఉంది. ప్రతి పార్లమెంట్ స్థానంలో బీసీ అభ్యర్థులకు రెండో స్థానాల్లో టిక్కెట్లు ఇవ్వాలని యోచిస్తోంది. అందుకోసం నియోజకవర్గాల్లో బీ సీల సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. బీసీ సామాజిక వర్గ సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉందని ప్రకటనలో ప్రకటించారు.
గతంలో రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ బీ సీ అభ్యర్థికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇవ్వలేదు. బీ సీ అభ్యర్థికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ జాప్యం చేసింది. బీ సీల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు బీ సీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించి ఎన్నికలకు వెళితే బీసీ ఓటర్ల విశ్వాసం పొందే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.
బిజేపి బీసీ పాలసీ
రాష్ట్ర బిజెపి బీ సీ ల సమగ్ర అభివృధికి కట్టుబడివున్నట్లు ప్రకటించింది. బీసీ లకు సబ్ ప్లాన్
రూపొందించి సబ్ ప్లాన్ ప్రకారం వెనుకబడిన తరగతులకు బడ్జెట్ లో నిధులు కేటాయింపు ఉంటుందని ప్రకటించింది . రాష్ట్రంలోని 40 సంఘాలను కేంద్ర బీ సీ జాబితాలో చేర్చి, నామినేటెడ్ పోస్టుల్లో బీ సీలకు ప్రాధాన్యం, రాష్ట్ర స్థాయి బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యా రుణాలు అందజేస్తామన్నారు. ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలనే ప్రతిపాదనలు రావడంతో బీజేపీ వ్యూహాలు రచించనుంది.
బి.ఆర్.ఎస్ బీసీ పాలసీ
రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ బీసీల సంక్షేమం కోసం అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తోంది. బీసీ వర్గాల ఓట్లను కాపాడుకునేందుకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటన చేశారు. బీసీ సంఘాలను ఆకర్షించేందుకు బీసీ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీసీల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజల అభివృద్ధి కోసం సదస్సులు నిర్వహించి ప్రగతి పథకాలను ప్రచారం చేస్తున్నారు. కళ్యాణలక్ష్మి, బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు, గొర్రెల పంపిణీ పథకాల ద్వారా బీసీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. యంత్రాలు, పనిముట్ల కొనుగోలుకు రూ.లక్ష నగదు సాయం అందజేస్తామని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీసీలు ఆర్థిక సహాయం కోసం ఇప్పటివరకు 5.28 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు.
ఇందుకోసం ప్రభుత్వం 400 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ ఆర్థిక సహాయం ప్రతి నియోజకవర్గంలో 300 మందికి మాత్రమే పరిమితం. అందరికీ పథకం వర్తింపచేయాలి. అప్పుడు మాత్రమే అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టి బీసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఆశిద్దాం. కుల గణనతోనే బీసీలకు న్యాయం బీసీలు అభివృద్ధి చెందాలంటే బీసీలకు రాజకీయ సాధికారత కల్పించాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కుల గణన చేపట్టడంలో రాజకీయ పార్టీలు అధికార పార్టీ అవలంబిస్తున్న దంద్వ రాజకీయ వైఖరి విడనాడి అంబేడ్కర్ ఆశించిన బడుగు బలహీన వర్గాలు బహుజనులు వెనుకబడిన తరగతులకు చట్ట సభల్లో 50 శాతం సీట్లు రిజర్వేషన్స్ పెట్టినపుడు మాత్రమే వారికి న్యాయం సిద్ధిస్తుంది. బీసీ లకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం తగిన ప్రాతినిధ్యం ఉండేట్లు చట్టసభల్లో రిజర్వేషన్స్ ప్రవేశపెట్టే బీసీ బిల్లు చట్టరూపం దాల్చినపుడు మాత్రమే రాజ్యాధికారంలో సముచిత వాటా లభిస్తుంది.
బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చెయ్యాలి కేంద్ర’ రాష్ట్ర స్థాయి మంత్రివర్గంలో బీ ‘సీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చెయ్యాలి .ప్రభుత్వాలు బీ’ సీల అభివృధి అంటే మానవాభివృద్ధిగా భావించాలి .చట్ట సభల్లో బిసి రిజర్వేషన్స్ వల్ల బీ సీల ఆత్మగౌరవం ఇనుమడిస్తుంది.బీ సీలకు సాధికారత కల్పించాలంటే దేశములో రాష్ట్రంలోని అన్ని జాతీయ ప్రాంతీయ ఉప ప్రాంతీయ రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో బీ సీ అభ్యర్థులకు 50 శాతం సీట్లు కేటాయించాలి. బీసీ కులగణన తోనే బిసిల కు న్యాయం జరుగుతుంది.
బీసీల ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఉద్యోగ రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలి. ప్రతి రాజకీయ పార్టీ ప్రతి కుల సంఘాల నాయకులతో సదస్సులు నిర్వహించి అభిప్రాయాలు సేకరించి కులాల వారీగా ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించాలి.బీసీల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన పథకాలపై సదస్సులు నిర్వహించి ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించాలి. బీసీ ఓటు బ్యాంకు ఎన్నికల్లో విజయం సాధించేందుకు మాత్రమే గాకుండా బీసీ ల జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించి బిసి ల సామాజిక ఆర్థిక రాజకీయ అభివృధి ద్వారా సుస్థిర ఆర్థికాభివృద్ధి వ్యూహాలు రూపొందించి సంక్షేమానికి ఆర్థిక స్వావలంబనకు పూనుకోవాలి
(నేదునూరి కనకయ్య)
అధ్యక్షులు-తెలంగాణ ఎకనామిక్ ఫోరం