సద్గురు ఆశయం చాలా గొప్పది

సద్గురు ఆశయం చాలా గొప్పది

  • సేవ్ సాయిల్ నినాదంతో మట్టిని కాపాడారు
  • గ్రామోత్సవ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ఊతమిస్తున్నారు
  • పాలమూరు అంటే ఒకప్పుడు పేదరికం… ఇప్పుడు అభివృద్ధికి చిరునామా
  • ఇండోర్ స్టేడియంలో జాతీయ క్రీడలు నిర్వహిస్తాం
  • ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామోత్సవ్ క్రీడా సంబరంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, ఆగస్టు 11 (విశ్వం న్యూస్) : సేవ్ సాయి నినాదంతో మట్టిని కాపాడడంలో సద్గురు ఎంతో కీలకమైన భూమిక పోషించారని ఇప్పుడు గ్రామోత్సవ్ క్రీడా పోటీల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ఊతమిస్తున్నారని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా మైదానంలో గ్రామోత్సవ్ పేరిట ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను జాతీయ జెండా ఎగురవేసి మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి వాలీబాల్, త్రో బాల్ ఆడారు.

సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలమూరు అంటేనే ఒకప్పుడు వలసల జిల్లాగా గుర్తింపు పొందిందని నేడు అభివృద్ధికి చిరునామాగా మార్చామని తెలిపారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకున్న తర్వాత ఒక్కో రంగం అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నామన్నారు. క్రీడారంగంలోనూ జిల్లాను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ఎంవీఎస్ కళాశాలలో ఇవాళ మినీ ఇండోర్ స్టేడియం ప్రారంభించామని, స్టేడియం ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం పనులను త్వరలో పూర్తిచేసి అక్కడ జాతీయ స్థాయి క్రీడలను నిర్వహిస్తామన్నారు.

యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీ టవర్ కం ఎనర్జీ పార్క్ ఏర్పాటు చేశామన్నారు. అమర రాజు పరిశ్రమ ద్వారా 10,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఇప్పటికే ఐటి టవర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాబ్ మేళాలో 650 మందికి ఐటీ ఉద్యోగాలను అందించామని, వచ్చేనెల రెండవ తేదీన మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసి సుమారు పదివేల ఉద్యోగాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

రామ్ మిర్యాల, మంగ్లీ సందడి…
గ్రామోత్సవ్ కు హాజరైన రామ్ మిర్యాల, మంగ్లీ కార్యక్రమానికి తమ పాటల ద్వారా ఊపు తీసుకొచ్చారు. ఊరెళ్ళి పోతా మామ, ఊరు పల్లెటూరు పాటలతో సందడి చేశారు. అద్భుతమైన గాత్రంతో మైదానాన్ని హోరెత్తించారు. గతంలో అనేక మార్లు మహబూబ్ నగర్ వచ్చామని… అప్పుడు బోసిపోయినట్లు ఉన్న పట్టణం ఇప్పుడు కళకళలాడుతోందని రామ్ మిర్యాల, మంగ్లీ తెలిపారు. పట్టణం అభివృద్ధి చెందిన తీరు చూస్తుంటే మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన కృషి కనిపిస్తోందన్నారు. తమ గాత్రంతో స్థానికులను ఉత్సాహపరిచిన రామ్ మిర్యాల, మంగ్లీలను మంత్రి సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *