బడి లేని పంచాయతీ
ఉండొద్దు: సీఎం రేవంత్

హైదరాబాద్, డిసెంబర్ 30 (విశ్వం న్యూస్) : విద్యార్థులు లేరన్న కారణంతో మూసివేసిన పాఠశాలలను తిరిగి తెరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బడి లేని పంచాయతీ ఉండొద్దని సీఎం స్పష్టం చేశారు.

టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో అవాంతరాలపై దృష్ఠి సారించాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. టీచర్ల బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని పేర్కొన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో మిగిలిన పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో స్కిల్ యూనివర్సిటీలను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.
కొడంగల్ నియోజకవర్గంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విద్య, పరిశ్రమలు, కార్మిక శాఖల కార్యదర్శులతో కమిటీ వేసి ప్రతిపాదనలను తయారు చేయాలని సీఎస్‌ను ఆదేశించారు.