తెలంగాణ ఉద్యమకారుడు ఎడ్ల జోగిరెడ్డి కన్నుమూత

విశ్వం న్యూస్ / తిమ్మాపూర్, మే 11:
తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ప్రజాప్రతినిధి ఎడ్ల జోగిరెడ్డి(61) సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణ వార్తతో మండల వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఎడ్ల జోగిరెడ్డి తిమ్మాపూర్ మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీగా సేవలందించడంతో పాటు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పాల్గొని ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర నాయకునిగా, బీజేపీ జిల్లా నాయకునిగా కొనసాగుతున్నారు.
కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జోగిరెడ్డి కడుపునొప్పి తీవ్రతను తట్టుకోలేక ఆదివారం వేకువజామున తన నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆయనను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
ఆయన మృతి పట్ల మండలంలోని ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలిపారు.