జులై 15న సెక్రటేరియట్ ముట్టడి
- నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం స్పందించాలి
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్, జూలై 7 (విశ్వం న్యూస్) : సమగ్ర కులగణన, 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్. కామారెడ్డి, యూత్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్ధానాలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యలు ఆర్.కృష్ణయ్య, ఇతర బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ.. సమగ్ర కులగణన చేస్తామని, స్ధానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ పార్టీ..అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా..ఎందుకు కాలయాపన చేస్తుందో చెప్పాలని రాజారాం యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనుగోలు చేసి, తన సీటును పదిలం చేసుకునే పనిలోపడ్డారని ఆరోపించారు.
బీసీ జనసభ ఆధ్వర్యంలో సమగ్ర కులగణన, 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం ఇటు బీసీ జన్నసభ, అటు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ మాత్రం పట్టించుకోకుండా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీసీలు, విద్యార్థుల న్యాయమైన డిమాండ్స్ ను ప్రభుత్వం మెడలు వంచి వాగ్ధానాలను అమలు చేయించాలంటే, జులై 15న జరిగే సెక్రటేరియట్ ముట్టడిని సంఘాలు, పార్టీలు అన్ని భేషజాలను పక్కనపెట్టి జయప్రదం చేయాలని రాజారాం యాదవ్ విజ్ఞప్తి చేశారు.
నిరుద్యోగ యువతీ యువకులతో చర్చలు జరిపి, ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసేంత వరకు వారికి అండగా బీసీ జనసభ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. 25 వేల పోస్టులతో మెగా డిఎస్సీని నిర్వహించడం, గ్రూప్- 2లో 2 వేలు, గ్రూప్-3లో 3 వేల ఉద్యోగాలు పెంచడంతోపాటు గ్రూప్-1మెయిన్స్ కి 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను అమలు చేయడం అసాధ్యం కాదన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీ పదవుల్లో తీవ్రమైన అన్యాయానికి గురవుతున్న బీసీలకు స్థానిక సంస్థల్లోనూ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వరా అంటూ కాంగ్రెస్ పెద్దలు సూటిగా ప్రశ్నించారు. సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేంత వరకు బీసీ కుల, సంఘాల ఐక్య కార్యచరణతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే..జులై 15న తలపెట్టిన ఛలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే.. బీసీలు, నిరుద్యోగులు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జులై 15 సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి ఓయూ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ఎల్చాల దత్తాత్రేయ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అన్ని యూనివర్సిటీల విద్యార్థులు ఛలో సెక్రటేరియట్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.