పెండింగ్ లో ఉన్న పోలీస్ ఉద్యోగుల వేతనాలు, అలవెన్స్ లను చెల్లించాలి
మల్యాల సుజిత్ కుమార్, డీసీసీ ఉపాధ్యక్షులు కరీంనగర్
కరీంనగర్, జనవరి 29 (విశ్వం న్యూస్) : రాష్ట్ర ప్రజల శాంతి భద్రత కోసం అహర్నిశలు కష్టపడే పోలీసుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం చూపుతుందని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు మల్యాల సుజిత్ కుమార్ నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించేటువంటి పోలీస్ సోదరులు ఎలాంటి సందర్భమైన, జాతరైన, సమావేశాలైనా, ఎన్నికలైనా, ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తమ వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి మరీ తెల్లవారు జామున నుండి రాత్రి దాకా డ్యూటీ చేస్తా ఉంటారని, అలాంటి వారిని మనం ఎప్పటికీ గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని, కానీ కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో పోలీస్ సోదరుల వేతనాల విషయంలో, ఇతర అదనపు భత్యాల విషయంలో ఇవ్వాల్సిన బెనిఫిట్స్ విషయంలో వివక్ష చూపించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.
ఏదైతే పోలీసు సోదరులు తమ వారాంతపు మరియు సెలవు దినాలను త్యాగం చేసి విధులు చేస్తున్నారో తక్షణమే వారికి ఇవ్వాల్సిన భత్యాలను గత మూడు నెలలుగా పెండింగ్ లో పెట్టడం జరిగిందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధ పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. అట్లాగే పోలీస్ సోదరులు తమ సొంత జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెడుతూ చేస్తున్న విధులకు సంబంధించి ఇవ్వవలసిన ట్రావెల్ అలవెన్సులను ఆరు నెలలుగా ఇవ్వకుండా, కేసిఆర్ కేవలం సిద్దిపేట, సిరిసిల్ల పోలీసులకు మాత్రమే సమయానికి జీతాలు గాని, టీ.ఏ బిల్లులు గాని, సలేండర్ లు గాని చెల్లిస్తూ మిగతా జిల్లాల పోలీసులను విస్మరిస్తున్నారని, వారు చేసిన అన్యాయం ఏంటి అని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఎంతటి గౌరవం కల్పించిందో గుర్తించాలని పోలీసు సోదరులను కోరినారు. కాంగ్రెస్ పార్టీ పోలీసులకు సమయానికి పదోన్నతులు కల్పించిందని, ఇవ్వాల్సిన బెనిఫిట్స్, జీతాలు అన్ని సమయానికి వచ్చేటివని, ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు ఏదో చిన్నగా జీతాలు పెంచి మిమ్మల్ని గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్షాల్ని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీ ద్వారా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారని, అయినప్పటికీ మేము ఎప్పటికీ పోలీస్ సోదరుల వెంటే ఉంటామని, మేము ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే హోం మినిస్టర్ మహెమూద్ అలి మీరు కేవలం సిద్దిపేట సిరిసిల్ల ఈ రెండు జిల్లాలు మాత్రమే కాకుండా మిగతా జిల్లాలు కూడా తెలంగాణలో అందరు భాగమే అని మిగతా జిల్లాలో పనిచేస్తున్న పోలీసులు కూడా మీ ప్రభుత్వంలో భాగస్వాములని, పోలీసులందరికీ సమయానికి జీతాలు వచ్చేలా, పెండింగ్లో ఉన్నటువంటి సలెండర్ లు ఇవ్వాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ అంశాన్ని రాష్ట్రస్థాయిలో ఒక ఉద్యమంలా తీసుకోవడం జరుగుతుందని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మల్యాల సుజిత్ కుమార్ హెచ్చరించారు.