
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విశ్వం న్యూస్) : సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి, అతని కుమారుడు సాయి కుమార్ ఇద్దరూ కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్లో పని చేస్తున్నారు. అయితే తండ్రి మొగిలి మద్యానికి బానిసయ్యాడు. వచ్చే డబ్బులు మెుత్తం తాగుడుకు ఖర్చు పెడుతూ ప్రతి రోజూ ఇంట్లో గొడవకు దిగేవాడు. తాగి గొడవ చేయవద్దని కుమారుడు సాయికుమార్ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు.
దీంతో విసిగిపోయిన కుమారుడు తండ్రి మెుగిలిని హతమార్చేందుకు సిద్ధమయ్యాడు. అందుకు సమయం కోసం ఎదురు చూశాడు. ఇవాళ మధ్యాహ్నం లాలాపేట ఇంటి నుంచి మొగిలి ఆర్టీసీ బస్సులో బయలుదేరగా.. అతడిని సాయి కుమార్ తన బైక్పై వెంబడించాడు. ఈసీఐఎల్ బస్ టెర్మినల్ వద్ద తండ్రి మెుగిలి బస్సు దిగగా.. ఆ వెంటనే ఆకస్మాత్తుగా అతడిపై దాడికి తెగబడ్డాడు.
తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితగా పొడిచాడు. తండ్రి మెుగిలి తప్పించుకునే ప్రయత్నం చేసినా.. వెంబడించి వేటాడి దారుణంగా పొడిచి చంపాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.