సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి

సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి

  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్

హైదరాబాద్, మే 26 (విశ్వం న్యూస్):నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉండటాన్ని బేషరతుగా ఖండించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్, ముఖ్యమంత్రి పదవికి ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఆయన ఓ బహిరంగ లేఖలో వెల్లడించారు.

ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్ ప్రకారం, రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా సంస్థకు విరాళాల పేరుతో భారీగా నిధులు సమీకరించి, quid pro quo ఒప్పందాల ద్వారా రాజకీయ లాభాలు పొందినట్టు ఆరోపణలు వచ్చాయని డా. శ్రవణ్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలు అవినీతిని నిరోధించే చట్టం – 1988 ప్రకారం తీవ్రమైనవని, ఇది కేవలం చట్టపరమైన అంశమే కాకుండా రాజ్యాంగ నైతికతకు భిన్నంగా ఉందని ఆయన అన్నారు.

“ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ఒక అత్యున్నత పదవి. అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఈ స్థాయిలో ఆరోపణలు రావడం ప్రజల్లో విశ్వాసాన్ని తక్కువ చేస్తుంది. పదవికి గౌరవం తీసుకురావాలంటే, మీరు తక్షణమే రాజీనామా చేయాలి,” అని ఆయన స్పష్టం చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం, ముఖ్యమంత్రి ప్రవర్తనపై ప్రజలు విశ్వాసం కోల్పోతే, గవర్నర్ చర్య తీసుకునే హక్కు ఉన్నదని డా. శ్రవణ్ తెలిపారు. అదేవిధంగా, S.R. Bommai కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ, రాజ్యాంగ నైతికత ఎంత కీలకమో గుర్తు చేశారు.

ఇంతకుముందు కూడా అనేక మంది ప్రముఖ నాయకులు—ఎల్కే అద్వానీ, లాలూ ప్రసాద్ యాదవ్, ఏ. రాజా, అశోక్ చవాన్, అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ఆరోపణల నేపథ్యంలో పదవులు వదిలిన ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు.

“ఇతరులు చాటిన మార్గాన్ని అనుసరించండి. ప్రజల నమ్మకాన్ని గెలవాలంటే, రాజీనామా చేయడమే సరైన మార్గం. న్యాయవ్యవస్థ తన పని చేసుకోవాలి, కానీ అది ముఖ్యమంత్రి పదవిని అపవిత్రం చేయకుండా ఉండాలి,” అని డా. శ్రవణ్ తన లేఖను ముగించారు.