మాట నిలబెట్టుకున్న కమిషనర్ రఘునందన్ రావు: ముజాహిద్ హుస్సేన్

హైదరాబాద్, జూన్ 23 (విశ్వం న్యూస్)- తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు కమిషనర్ ఎం. రఘునందన్ రావు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ విశేష గుర్తింపు పొందారని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనంతరం ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డివిజన్లు, సర్కిళ్ల ఏర్పాటు, ఉద్యోగుల ప్రమోషన్ల వంటి అంశాలపై రఘునందన్ రావు ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. గతంలో 15 డివిజన్లు మాత్రమే ఉండగా, కొత్తగా నాలుగు డివిజన్లు మంజూరు కావడంతో రాష్ట్రంలో మొత్తం 19 వాణిజ్య పన్నుల డివిజన్లు ఏర్పాటయ్యాయని తెలిపారు.
జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి అడిషనల్ కమిషనర్ స్థాయి వరకు వివిధ కేడర్లలో ప్రమోషన్లు కల్పించడంతో ఉద్యోగుల్లో నూతన ఉత్సాహం నెలకొందని ముజాహిద్ హుస్సేన్ అన్నారు. ఉద్యోగ సంఘాలు తీసుకువచ్చిన ప్రతి సమస్యను సానుకూలంగా స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న అధికారిగా రఘునందన్ రావు పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జీఎస్టీ, ఎక్సైజ్ ఆదాయాలను సమర్థవంతంగా సమకూర్చడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ శాఖ పనితీరును మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
ఇలాంటి సమర్థవంతమైన అధికారిని ప్రభుత్వం కొనసాగిస్తే శాఖకు, ప్రభుత్వానికి మరింత మేలు జరుగుతుందని ముజాహిద్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు.