జూబ్లిహిల్స్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై బిఆర్ఎస్ ఆవేదన

అధికారుల నిర్లక్ష్యంపై
బిఆర్ఎస్ ఫిర్యాదు

  • సి-విజిల్ యాప్ పనిచేయడం లేదు – జూబ్లిహిల్స్ ఎన్నికలు నిష్పాక్షపాతంగా జరపాలని బిఆర్ఎస్ ఫిర్యాదు
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఛీఫ్ ఎన్నికల అధికారికి విజ్ఞప్తి

హైదరాబాద్, నవంబర్ 8 (విశ్వం న్యూస్) : జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికలను నిష్పాక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ఆచారసహితిని విచ్చలవిడిగా ఉల్లంఘిస్తున్నప్పటికీ, ఎన్నికల అధికారులు, పోలీసులు మౌనంగా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో సి-విజిల్ యాప్ పనిచేయకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి, నగదు పంచుతున్నా అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అలాగే, రౌడీషీటర్లు, కేసులు నమోదైన వ్యక్తులు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. బిఆర్ఎస్ నాయకుల ఇళ్లను తనిఖీ చేస్తూనే, కాంగ్రెస్ నాయకులపై చేసిన ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇక ఎన్నికల ముందు నుంచే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులను జూబ్లిహిల్స్ పరిధికి బదిలీ చేశారని, ఇప్పటివరకు 14 సార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బిఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంఐఎం, కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా చీరలు పంచినా, ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల పేరుతో చట్టవిరుద్ధంగా వ్యవహరించినా ఎన్నికల కమిషన్ సడలింపు ధోరణి అవలంబిస్తోందని వారు విమర్శించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *