బీసీల హక్కులపై కుట్ర:దాసోజు శ్రవణ్

- రాజ్యాంగాన్ని కాలరాస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
- GO 46 పేరిట బీసీ రిజర్వేషన్ల హత్య – మహిళలకు కూడా ఘోర అన్యాయం
హైదరాబాద్, నవంబర్ 26 (విశ్వం న్యూస్):తెలంగాణలో బీసీలు, మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను క్రమపద్ధతిగా హరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బహిరంగంగా కుట్రకు దిగిందని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. కులగణన పేరిట రూ.200 కోట్లు ఖర్చు చేసి బూసాని వెంకటేశ్వర్లు కమిషన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిషన్ అంటూ రెండు సంవత్సరాలు ప్రజలను మభ్యపెట్టిన ప్రభుత్వం చివరికి GO-46 తీసుకువచ్చి బీసీలకు రావాల్సిన రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లను క్రూరంగా కత్తిరించిందని పార్టీ పేర్కొంది.
ఈ GOను ఆధారంగా చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వానికి లోబడేలా మార్చి, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం అత్యంత ప్రమాదకరమని బీఆర్ఎస్ ఆగ్రహించింది. జిల్లాల వారీగా ఆదిలాబాద్‌లో 4.8%, జనగాంలో 16%, ఖమ్మంలో 9.45%, మంచిర్యాలలో 7.5%, ములుగులో 3.5% మాత్రమే కేటాయించడం ద్వారా బీసీలు లేనట్టుగా చూపిస్తూ వారికి రావాల్సిన న్యాయం కొల్లగొట్టిందని తెలిపింది.
మహిళలకు కూడా తీవ్రమైన అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఏ జిల్లాలోనూ, ఏ మండలంలోనూ, ఏ గ్రామపంచాయతీలోనూ మహిళా రిజర్వేషన్లు 50% దాటకుండా కేటాయించడం ద్వారా మహిళా శక్తిని అవమానించారని పార్టీ విమర్శించింది. ఇది రేవంత్ రెడ్డి జేబులో నుంచి ఇవ్వాల్సిన దానం కాదని, అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడం మాత్రమేనని స్పష్టం చేసింది.
రాజ్యాంగ దినోత్సవం నాడు స్థానిక ఎన్నికల పేరిట అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించడం తెలంగాణ ప్రజలపై చేసిన ఘోర ద్రోహమని బీఆర్ఎస్ అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో బీసీలు, మహిళలు, ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి పౌరుడు ఈ ప్రభుత్వానికి తగిన ప్రజాస్వామ్య సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చింది.
ప్రస్తుతం తెలంగాణలో అమల్లో ఉన్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, అనుముల రాజ్యాంగమని ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని బీఆర్ఎస్ స్పష్టం చేసింది.