వార్డుల విభజన పేరిట
రాజ్యాంగ విద్రోహం

హైదరాబాద్, జనవరి 11, 2026 (విశ్వం న్యూస్) : జీహెచ్ఎంసీ వార్డుల విభజన, మున్సిపాలిటీల విలీనం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్రంగా విమర్శించారు. సికింద్రాబాద్‌లోని బాలంరాయ్ లీ ప్యాలెస్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
74వ సవరణకు విరుద్ధంగా చర్యలు: వార్డుల విభజన అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని, అయితే 74వ రాజ్యాంగ సవరణను తుంగలో తొక్కుతూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని పక్కన పెట్టి ASCI, CGG వంటి ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగించడం ప్రజాస్వామ్యానికి ముప్పేనని శ్రవణ్ పేర్కొన్నారు.
సికింద్రాబాద్ చరిత్రను చెరిపివేత: 220 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ను ‘మల్కాజిగిరి’ పేరుతో అంతం చేయాలని చూడటం చారిత్రక తప్పిదమన్నారు. లష్కర్ బోనాలు, ఉజ్జయిని మహంకాళి ఆలయం, సెయింట్ మేరీస్ చర్చి, క్లాక్ టవర్ వంటి చిహ్నాలే సికింద్రాబాద్ అసలు గుర్తింపని గుర్తుచేశారు.

ఔరంగజేబు ప్రయత్నాల మాదిరే విఫలం : నాడు ఔరంగజేబు హైదరాబాద్ పేరును మార్చాలని చూసి విఫలమయ్యాడని, నేడు రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చెరపాలని చూస్తున్నారని, ఈ ప్రయత్నం కూడా తప్పకుండా విఫలమవుతుందని వ్యాఖ్యానించారు.
గెర్రీమాండరింగ్ ఆరోపణ : రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష బలం ఉన్న ప్రాంతాలను విడగొట్టి ఓటు బ్యాంకులను విచ్ఛిన్నం చేసేలా వార్డుల సరిహద్దులు మార్చుతున్నారని ఆరోపించారు. ఇది నగరంలోని మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందన్నారు.
జీహెచ్ఎంసీ విస్తరణ వెనుక స్కామ్ : జీహెచ్ఎంసీని 650 చ.కి.మీ నుంచి 2053 చ.కి.మీ వరకు విస్తరించడంలో భారీ రియల్ ఎస్టేట్ మాఫియా పాత్ర ఉందని శ్రవణ్ ఆరోపించారు. శాస్త్రీయ అధ్యయనం లేకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.
మ్యాపులు బహిర్గతం చేయాలి : వార్డుల విభజనకు సంబంధించిన మ్యాపులు వెంటనే బహిర్గతం చేయాలని, ప్రతి వార్డులో ప్రజలతో బహిరంగ విచారణలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్‌ను ప్రత్యేక పరిపాలనా, చారిత్రక విభాగంగా కొనసాగించాలని స్పష్టం చేశారు.